Three People Died Due to Electric Shock in Kakinada District: కాకినాడ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికులను కలచివేసింది. ఒకేసారి విద్యుత్ ప్రమాదానికి గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోవటంతో మృతుల గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరణ వార్తను జీర్ణించుకోలేని మృతుల కుటుంబ సభ్యుల అర్తనాదాలు మిన్నంటాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని జగ్గంపేట మండలం రాజపూడి శివారున సీతారాంపురం గ్రామంలో గళ్ల అప్పారావు అనే వ్యక్తి ఫామయిల్ తోట సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో తోటలోని విద్యుత్ మోటార్ మరమ్మతులకు గురైంది. దీంతో శనివారం ఉదయం మరమ్మతులు నిర్వహించేందుకు.. అప్పారావు కుమారుడు గళ్ల నాగరాజు, జగ్గంపేటకు చెందిన కిల్లి నాగు, కిర్లంపూడి మండలం బూరుగుపూడికి చెందిన భోదిరెడ్డి సూరిబాబు ఫామయిల్ తోటకు వెళ్లారు.
మరమ్మతుల కోసమని విద్యుత్ మోటారును బయటకు తీస్తుండగా.. పైన ఉన్న విద్యుత్ తీగలకు మోటారు తగిలింది. దీంతో ముగ్గురు ఒకేసారిగా విద్యుత్ ప్రమాదానికి గురయ్యారు. విద్యుత్ ధాటికి ముగ్గరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. ప్రమాద స్థలానికి టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ చేరుకుని ప్రమాద పరిస్థితిని తెలుసుకున్నారు.