PINARAYI Vijayan: బంగారం స్మగ్లింగ్ కేసు కేరళ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ.. తన రాజీనామాకు డిమాండ్ చేస్తున్న విపక్షాలపై ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలు తనపై లేదా తన ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపించలేవని అన్నారు. ప్రజల మద్దతు, విశ్వాసం తనకు ఇంకా ఉందని తెలిపారు.
గత ఏడాది శాసనసభ ఎన్నికల సమయంలోనూ తనపై ఇలాంటి ఆరోపణలు చాలా వచ్చాయన్న విజయన్.. ప్రజలు వాటన్నింటినీ తిరస్కరించి రాష్ట్రాన్ని పాలించాలని తీర్పు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజలకు తాము ఇంకా రుణపడి ఉన్నామని, దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే వారికి లొంగబోమని స్పష్టం చేశారు. తనను బెదిరించడానికి ఎవరూ ప్రయత్నించరాదని విజయన్ హెచ్చరించారు.
ప్రజలపై తనకు పూర్తి నమ్మకం ఉందన్న కేరళ సీఎం.. తప్పుడు ఆరోపణలతో స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని భావిస్తే ప్రజలు వాస్తవాలను గ్రహిస్తారని అన్నారు. బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక నిందితురాలు స్వప్నా సురేశ్, విజయన్, ఆయన కుటుంబ సభ్యులపై తాజాగా ఆరోపణలు చేయగా, తన రాజీనామాకు విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో విజయన్ స్పందించారు.
ఇవీ చదవండి: రాష్ట్రపతి ఎన్నికలపై 15న విపక్షాల భేటీ.. ఆ సీఎంలకు దీదీ లేఖ
రాజ్యసభ ఎన్నికల్లో వికసించిన కమలం.. నాలుగు రాష్ట్రాల్లోనూ సత్తా