కఠిన ఆంక్షల మధ్య తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయంలో కరోనా కలవరం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు 39 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వైరస్ బారిన పడినవారిలో భక్తులు సహా పోలీసులు, ఆలయ సిబ్బంది ఉన్నట్లు వెల్లడించారు.
వివిధ శాఖలకు చెందిన 27 మంది ఉద్యోగులకు పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. వారిని సత్వరమే.. కొవిడ్ చికిత్స కోసం తరలించినట్లు వెల్లడించింది.
"ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డుకు చెందిన నలుగురు ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. ఇద్దరు తాత్కాలిక ఉద్యోగులు, మరో ఇద్దరు పోలీసులకు పాజిటివ్‌గా తేలింది. మొత్తం 39 మందికి వైరస్ సోకింది. శబరిమలలోని సన్నిధానం, పంబా, నీలక్కల్ క్యాంపుల్లో వీరికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది."
-- ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు.
వార్షిక మండల పూజకోసం నవంబర్ 16 నుంచి ఆలయంలోకి భక్తుల ప్రవేశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 10 నుంచి 60 ఏళ్ల వయస్సు ఉన్నవారినే దర్శనానికి అనుమతినిస్తున్నారు. కేరళలోని వివిధ ప్రాంతాల్లోని బస్సు స్టేషన్లు, రైల్వే స్టేషన్లు యాంటీజెన్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తగిన స్థాయిలో వైద్య సిబ్బందిని నియమించారు.
శబరిమలలో కీలకమైన మండల పూజ డిసెంబర్ 26న జరగనుంది. జనవరి14న జరిగే మకరవిళక్కు పూజ అనంతరం.. జనవరి 20న ఆలయాన్ని అధికారులు మళ్లీ మూసివేయనున్నారు.
ఇదీ చూడండి:శబరిమల భక్తులకు స్టీల్ బాటిళ్లలో ఔషధ జలం