డబ్బులు, బంగారం చోరీలకు పాల్పడటం రొటీన్‌గా ఉంటుందనుకున్నారేమో.. రూట్ మార్చి దొంగతనాలకు పాల్పడుతున్నారు కొందరు దుండగులు. బిహార్‌లోని రెండు జిల్లాల్లో ఇనుప వంతెనలను ఎత్తుకెళ్లిన ఘటనలు మరవకముందే అలాంటి చోరీనే పంజాబ్‌లోని బఠిండా జిల్లాలో వెలుగు చూసింది. అయితే, ఈసారి ఏకంగా హైఓల్టేజ్ విద్యుత్తు స్తంభాలనే మాయం చేసే ప్రయత్నం చేశారు. దీంతో అవి కుప్పకూలి విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఇదీ జరిగింది: జిల్లాలోని రాంపుర పూల్‌లో రెండు 66 కేవీ హైఓల్టేజ్ విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి. దొంగతనం కోసం టవర్ల బోల్టులు తొలగించటం వల్ల పడిపోయినట్లు అధికారులు తెలిపారు. స్తంభాలు కూలిపోవటం వల్ల అక్కడి నుంచి దొంగలు పారిపోయారని చెప్పారు. విషయం తెలుసుకున్న డిస్ట్రిబ్యూషన్ ఇంజినీరింగ్ డైరెక్టర్ డీపీఎస్ గ్రెవాల్ సంఘటనాస్థలాన్ని సందర్శించారు. దీనిపై శాఖాపరమైన దర్యాప్తు చేపట్టేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీ వేయటం సహా.. పోలీసులకు ఫిర్యాదు చేయాలని పీఅండ్ఎం విభాగం చీఫ్, ఎస్ఈని ఆదేశించారు. టవర్లు కూలిపోవటం వల్ల నిలిచిన విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించేందుకు రిపేర్ పనులు చేస్తున్నట్లు చెప్పారు.
"రాంపుర పూల్‌లోని రెండు 66కేవీ లైన్ టవర్ల నట్లు తీసేందుకు ప్రయత్నాలు జరిగాయి. మొదటి స్టెప్‌లో నట్లకు వెల్డింగ్ చేయటం వల్ల.. రెండో స్టెప్‌లో తీశారు. దీంతో మూడో స్టెప్లోని బేస్ కుదుపులకు లోనైంది. ఈ పరిస్థితులను గమనిస్తే.. ఇది ఒక్కరోజులో జరిగినట్లు లేదు. కొన్ని రోజుల పాటు నట్లు తొలగించి చోరీకి పాల్పడేందుకు యత్నించారు."
- డీపీఎస్ గ్రెవాల్, డిస్ట్రిబ్యూషన్ ఇంజినీరింగ్ డైరెక్టర్.
దర్యాప్తు కమిటీలో పీఅండ్ఎం బఠిండా ఎస్ఈ, బఠిండా డిస్ట్రిబ్యూషన్ ఎస్ఈ, పాటియాల ట్రాన్స్మిషన్ ఎస్ఈలు ఉన్నట్లు చెప్పారు గ్రెవాల్. త్వరలోనే విద్యుత్తు సరఫరాను పునరుద్ధరిస్తామని, రిపేర్‌కు సంబంధించిన సామగ్రిని సంఘటనా స్థలానికి చేర్చామన్నారు. ఆదివారం సాయంత్రానికి విద్యుత్తు సరఫరా చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: : 60 అడుగుల బ్రిడ్జిని మాయం చేసిన దొంగలు.. అధికారులు షాక్