ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి విలయ తాండవం చేసింది. ఇక మన దేశంలో గ్రామాలు, పట్టణాలు అని తేడా లేకుండా.. మొదటి, రెండు దశల్లో ఉగ్రరూపం దాల్చింది. అయితే.. మహారాష్ట్ర గోందియా జిల్లా కరంజీ గ్రామంలోకి మాత్రం మహమ్మారి ప్రవేశించలేకపోయింది. ఎలాగంటే..
సమష్టి కృషి..
కరంజీ గ్రామంలో 2,780 మంది జనాభా. 580 కుటుంబాలు ఉన్నాయి. మహమ్మారి ప్రబలినప్పటి నుంచి గ్రామస్థులకు వైరస్‌పై అవగాహన కల్పించటంలో సర్పంచ్ హన్స్ రాజ్ చౌతే పాత్ర కీలకం. ఆ గ్రామంలోని పంచాయతీ సభ్యులు, మాజీ ప్రభుత్వ అధికారులు, వైద్యులు, యువత.. వైరస్‌పై సమష్టి కృషి చేశారు. ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ప్రభుత్వ నిబంధనలు, వైద్య, ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను పక్కాగా పాటించారు.
కమిటీలు ఏర్పాటు..
గ్రామంలో ఒక్కో అంశానికి సంబంధించి ఒక్కో కమిటీని ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీకి ఒక్కో అంశంపై అవగాహన కల్పించారు. పరిశుభ్రత, మాస్కు ధారణ, భౌతిక దూరం తదితర వాటిపై ప్రజలకు వివరించారు.
మూడో వేవ్ కూడా రాదు..
తమ గ్రామంలోకి కరోనా మూడో వేవ్ సైతం రాదని సర్పంచ్ హన్స్ రాజ్ చౌతే ధీమా వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ తెలిపారు. గ్రామంలో 872 మంది 45ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. వారిలో ప్రస్తుతం 693 మందికి కొవిడ్ టీకాలను అందించారు. మిగతా వారికి త్వరలో టీకాలు అందనున్నాయి.
ఇదీ చదవండి : సీజనల్ వ్యాధుల ముప్పు- అవగాహనతోనే అడ్డుకట్ట