కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన ఏడేళ్ల కాలంలో 9,52,875 మంది ఆత్మహత్య (suicide cases in india 2021) చేసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. జాతీయ నేర గణాంకాల నమోదు మండలి (ఎన్‌సీఆర్‌బీ) ద్వారా విడుదలైన అధికారిక లెక్కలే ఈ విషయాన్ని చెబుతున్నాయని పేర్కొంది. పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఆదివారం ఒక ప్రకటనలో ఆ గణాంకాలు విడుదల చేశారు. 2014-2020 మధ్య 69,047 మంది విద్యార్థులు, 86,851 మంది నిరుద్యోగులు, 78,303 మంది రైతులు, 35,112 మంది వ్యవసాయ కూలీలు, 1,93,795 మంది దినసరి కూలీలు, 1,52,127 మంది గృహిణులు (suicide cases in india today) బలవన్మరణానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల కారణంగానే వీరు తనువు చాలించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019-20 మధ్య రైతులు/ రైతుకూలీల ఆత్మహత్యలు 19% పెరిగినట్లు గుర్తుచేశారు. గత ఏడేళ్లలో హెక్టారుకు పెట్టుబడి వ్యయం రూ.25వేల మేర పెరిగిపోగా రైతు రోజువారీ ఆదాయం రూ.26.67కి పడిపోయి, తలసరి అప్పు రూ.74వేలకు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధరకంటే సగటున 40% తక్కువ ధరకే రైతులు పంటల్ని అమ్మాల్సి వస్తోందన్నారు. ప్రధానమంత్రి పంటల బీమా పథకం రైతులకు మేలుచేసే బదులు వ్యాపార సంస్థలకు రూ.26వేల కోట్ల లాభాన్ని సమకూర్చిందన్నారు.
చైనా సరిహద్దు గురించి భాజపా మాట్లాడాల్సింది
చైనాతో ఉన్న సరిహద్దు వివాదాల గురించి మాట్లాడకుండా భాజపా 'కుహనా జాతీయవాది'గా నటిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. డ్రాగన్‌తో పొంచి ఉన్న ముప్పు గురించి వాస్తవాలు చెప్పే ధైర్యం భాజపాకి ఉందా అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. చైనాతో వాణిజ్యం ఏడాదిలో 67% పెరిగిందని చెప్పారు. మన ప్రయోజనాలకు దెబ్బకలిగేలా సరిహద్దు దేశాలన్నింటితో సంబంధాలను చైనా పెంచుకుంటున్నా భారత ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉండడమే కాకుండా ఆ దేశానికి క్లీన్‌చిట్ ఇస్తోందని ఆరోపించారు.
అవి తప్పుడు కథనాలు: రిజిజు
అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా ఒక గ్రామాన్ని నిర్మించిందంటూ తప్పుడు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయని భాజపా నేతలు ఖండించారు. ప్రభుత్వ విశ్వసనీయతను, సైనిక బలాన్ని ప్రశ్నించే రీతిలో తప్పుడు కథనాలను ఉద్దేశపూర్వకంగా వ్యాప్తిలోకి తీసుకువస్తున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు.
ఇదీ చదవండి:'భాజపా శక్తిని ఇంకా పూర్తిగా చూడలేదు.. త్వరలోనే...'