కర్ణాటక నీటి పారుదల శాఖ మంత్రి రమేశ్ జర్కిహోళి ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేశారు. బాధితురాలి తరపున కమిషనరేట్ కార్యాలయంలో కార్యకర్త దినేశ్ కల్లహళ్లి మంగళవారం ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ కేసును కబ్బన్ పార్క్ ఠాణాకు బదిలీ చేశారు.
"ఇది చాలా సున్నితమైన అంశం. బాధితురాలి వివరాలను నేను వెల్లడించలేను. ఈ విషయంపై ఆమె కుటుంబసభ్యులు నన్ను సంప్రదించారు. తమకు పోరాడేందుకు స్తోమత లేదని, నా సహాయం కోరారు. ఇందుకు సంబంధించిన సీడీ నిన్న నాకు అందించారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తాను అంటూ మంత్రి బాధితురాలిని లైంగికంగా వేధించారు. బాధితురాలు న్యాయం చేయమని అడిగింది."
-దినేశ్ కల్లహళ్లి, సామాజిక కార్యకర్త
ఫిర్యాదులో ఏముంది ?
బెంగళూరులోని ఆర్టీ నగర్లో నివసిస్తున్న బాధితురాలిని ఓ లఘు చిత్రం నిర్మిస్తున్న సమయంలో విద్యుత్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మంత్రి ఆమెను లైంగికంగా వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై తన వద్ద ఆధారంగా సీడీ ఉందని చెప్పిన బాధితురాలిపై బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
ఈ కేసుపై స్పందించిన ప్రతిపక్షాలు మంత్రిపై విమర్శలు గుప్పించాయి. కాంగ్రెస్ పార్టీ పలు ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేసింది.
ఫేక్ వీడియో
ఈ ఆరోపణలను మంత్రి రమేశ్ జర్కిహోళి ఖండించారు. తన చిత్రాలను ఉపయోగించి ఎవరో సీడీని రూపొందించారని , ఇది ఫేక్ అని ఆరోపించారు. సమగ్ర దర్యాప్తు చేస్తే అన్ని విషయాలు వెలుగులోని వస్తాయని, కేసును ఎదుర్కొంటానని, వెనుకంజ వేయబోనని ప్రకటించారు.
మరోవైపు మంత్రి నిజంగా తప్పు చేసినట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. ఇక మంత్రిని లక్ష్యంగా చేసుకుని హనీ ట్రాప్ చేసినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేసి, విచారణకు సహకరించాలని డిమాండు చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం రాత్రి బెంగళూరులో ధర్నాకు దిగారు.
ఇదీ చదవండి : 'దర్యాప్తు సంస్థల్లో కెమెరాల ఏర్పాటు'పై సుప్రీం అసంతృప్తి