Telangana HC on Bandi Sanajy petition in SSC Paper Leak: పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కోరుతూ బండి సంజయ్ వేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఇవాళ విచారణ జరిపారు. రాజకీయ దురుద్దేశంతోనే పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసు పెట్టారని బండి సంజయ్ పిటిషన్లో పేర్కొన్నారు. సంజయ్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్.. పరీక్ష కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ తగిన జాగ్రత్తలు తీసుకోలేదన్నారు.
10th class hindi paper leak case: కరీంనగర్‌లో అర్థరాత్రి అరెస్టు చేసి సుమారు 150 కిలోమీటర్ల దూరంలోని బొమ్మలరామారానికి ఎందుకు తీసుకెళ్లారో పోలీసులకే తెలియాలని న్యాయవాది వాదించారు. అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు అమలు చేయలేదన్నారు. ఈ కేసు విషయంలో బండి సంజయ్ ప్రమేయంపై తగిన ఆధారాలున్నాయని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ న్యాయస్థానానికి తెలిపారు. సంజయ్ అరెస్టు తర్వాత ప్రశ్నపత్రాల లీకేజీ ఆగిపోయిందన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీకి మార్చి ప్రారంభం నుంచే కుట్ర జరిగిందన్నారు.
దర్యాప్తులో కీలకమైన మొబైల్ ఫోన్‌ను బండి సంజయ్ పోలీసులకు ఇవ్వడం లేదని ఏజీ తెలిపారు. ఫోన్ గల్లంతుపై ఫిర్యాదు చేశారని.. ఎక్కడుందో పోలీసులే చెప్పాలని బండి సంజయ్ న్యాయవాది పేర్కొన్నారు. ఫోన్ ఎక్కడుందో కూడా కొన్ని రోజుల్లోనే దర్యాప్తులో తేలుతుందని న్యాయస్థానంలో పేర్కొన్నారు. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఇరువైపుల హుందాగా వ్యవహరించాలని వ్యాఖ్యానించారు. పోలీసులు చట్టబద్ధంగానే ఉన్నారని ఏజీ పేర్కొనగా.. అర్ధరాత్రి అరెస్టు చేశారు కదా అని హైకోర్టు పేర్కొంది.
ts ssc paper leak case Arguments in High Court: గతంలో ఒకటి, రెండు రాష్ట్రాలకే పరిమితమైన ప్రశ్నపత్రాల లీకేజీ.. ఇప్పుడు గుజరాత్, అసోం సహా దేశమంతటికీ విస్తరించిందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని బండి సంజయ్ తరఫు న్యాయవాది కోరారు. ఇప్పటికే అరెస్టయి బెయిల్పై విడుదలైనందున.. అలాంటి ఆదేశాల అవసరమేంటని హైకోర్టు ప్రశ్నించింది.
బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేశారని సంజయ్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్ క్వాష్ చేసేందుకు ప్రాథమిక అంశాలున్నాయని భావిస్తున్నందుకే నోటీసులు జారీ చేస్తున్నామని.. మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వానికి, కమలాపూర్ పాఠాశాల ప్రధానోపాధ్యాయుడికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 16కి వాయిదా వేసింది.
ఇవీ చదవండి:
TSPSC పేపర్ లీకేజీపై పోరుకు సిద్ధమైన కాంగ్రెస్.. కార్యాచరణ ఇదే..!