Telangana Assembly Election Results 2023 BRS Strategy Review : ఎలాగైనా హ్యాట్రిక్ విజయం సాధించాలని సర్వశక్తులూ ఒడ్డిన భారత రాష్ట్ర సమితి.. అందుబాటులో ఉన్న అవకాశలన్నీ వాడేసింది. ఎమ్మెల్యేల పనితీరును పరిశీలించి.. వారికి ఉన్న గెలుపు అవకాశాలను అంచనా వేసిమరీ టికెట్లు కేటాయించింది. గులాబీ దళపతి కేసీఆర్ స్వయంగా వడపోత పోశారు. ఈ క్రమంలో పలువురు సిట్టింగుల సీట్లు గల్లంతయ్యాయి. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీచేసిన అభ్యర్థుల్లో.. 11 మంది సీట్లు కోల్పోయారు. మరి.. వారు ఎవరు? వారిని కాదని ఎవరికి టికెట్ ఇచ్చారు? వీరిలో ఎందరు గెలుపొందారు? ఎందరు ఓడిపోయారు? అన్న వివరాలు ఇప్పుడు చూద్దాం.
అలంపూర్ : 2018 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో గులాబీ పార్టీ తరపున అబ్రహం పోటీచేసి గెలుపొందారు. అయితే.. 2023 నాటికి పరిస్థితి మారిపోయింది. పలు కారణాలను పరిగణనలోకి తీసుకున్న బీఆర్ఎస్ అధిష్టానం.. అబ్రహంకు టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో విజయుడికి సీటు కేటాయించింది. ఈ అవకాశాన్ని విజయుడు సద్వినియోగం చేసుకున్నారు. "విజయుడి"గా నిలిచారు.
జనగాం : ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఉన్నారు. కానీ.. ఈసారి ఎన్నికల్లో సీటు దక్కలేదు. ఆయన స్థానంలో పల్ల రాజేశ్వర్ రెడ్డికి సీటు దక్కింది. పల్లా గెలుపొందారు.
స్టేషన్ ఘన్పూర్ : సిట్టింగ్ ఎమ్మెల్యేగా తాటికొండ రాజయ్య ఉన్నారు. పలు కారణాలతో బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చింది. కడియం విజయం సాధించారు.
నర్సాపూర్ : ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మదన్ రెడ్డి ఉన్నారు. ఆయన స్థానంలో సునీతా లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చారు. ఈమె విజయం సాధించారు.
కోరుట్ల : ఈ నియోజకవర్గంలో కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ సారి ఆయన కుమారుడు సంజయ్ కి టికెట్ ఇచ్చారు. సంజయ్ విజయం సాధించారు.
అసిఫాబాద్ : ఆత్రం సక్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018లో కాంగ్రెస్ తరపున గెలిచిన ఆయన.. ఆ తర్వాత గులాబీ గూటికి చేరారు. సక్కుకు టికెట్ నిరాకరించిన బీఆర్ఎస్ అధిష్టానం.. కోవా లక్ష్మీకి ఛాన్స్ ఇచ్చింది. ఆమె గెలుపొందారు.
బోథ్ : ఈ నియోజకవర్గంలో రాథోడ్ బాబురావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా అనిల్ జాదవ్ బరిలో నిలిచారు. విజయం సాధించారు.
ఉప్పల్ : ఈ నియోజకవర్గంలో బేతి సుభాష్ రెడ్డి స్థానంలో బండారు లక్ష్మారెడ్డికి అవకాశం బీఆర్ఎస్ అవకాశం కల్పించింది. బండారు విజయం సాధించారు.
మల్కాజ్ గిరి : ఈ నియోజకవర్గంలో మైనం పల్లి హన్మంతరావు స్థానంలో మర్రి రాజశేఖర్ రెడ్డికి బీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది. ఈయన గెలుపొందారు.
దుబ్బాక : ఇది బీజేపీ సిట్టింగ్ స్థానం. బీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతా రెడ్డిపై రఘునందన్ రావు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చింది. కొత్తప్రభాకర్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. ఆయన విజయం సాధించారు.
వేములవాడ : ఇక్కడ రమేష్ బాబు స్థానంలో చల్మెడ లక్ష్మీ నర్సింహారావుకు బీఆర్ఎస్ అధిష్టానం సీటు కేటాయించింది. కానీ.. ఆయన ఓటమి పాలయ్యారు.
ఖానాపూర్ : ఇక్కడ రేఖానాయక్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె స్థానంలో జాన్సన్ నాయక్ బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. ఆయన ఓడిపోయారు.