TDP fire on YCP government : అవినీతి మరకను చంద్రబాబుకు అంటించాలనేదే జగన్ కుట్ర అని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. అక్రమ కేసులకు టీడీపీ భయపడదు అని ఆయన స్పష్టం చేశారు. ఆరోపణ చేసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఓటమి భయంతోనే టీడీపీ, చంద్రబాబుపై దుష్ప్రచారం చేస్తున్నారని పయ్యావుల పేర్కొన్నారు.
భయపడేదే లేదు.. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పయ్యావుల.. ప్రశ్నించిన వారందరినీ అరెస్టు చేసుకుంటూ వెళ్తారా? అని దుయ్యబట్టారు. ఇలానే చేసుకుంటూ పోతే రెండు సీట్లకే పరిమితమవుతారని హెచ్చరించారు. ప్రాథమిక ఆధారాలు (Basic evidence) లేకుండా కేసు నమోదు చేసి అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించిన పయ్యావుల.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2021లోనే సీమెన్స్ అద్భుత పనితీరు ప్రదర్శించిందని సర్టిఫికెట్ ఇచ్చారు కదా అని గుర్తు చేశారు. ఒప్పందం ప్రకారం సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ అన్ని అందాయని ఒకవైపు చెబుతున్నారు... తిరిగి నిధులు పక్కదారి పట్టాయంటూనే ఇంతవరకూ నిరూపించలేకపోయారు అని పేర్కొన్నారు. కేవలం అవినీతి మరకను చంద్రబాబుకు అంటించాలనేదే జగన్ (JAGAN) కుట్ర.. అక్రమ కేసులకు టీడీపీ భయపడదు అని చెప్పారు. రాజకీయ రణక్షేత్రంలో టీడీపీ (TDP) పదింతల శక్తితో ఎదుర్కొంటుందని తెలిపారు.
ప్రజా వ్యతిరేకతను దృష్టి మళ్లించడానికే.. ప్రభుత్వం, సీమెన్స్, డిజైన్‌టెక్ (DesignTech) ఒప్పందం చేసుకున్నా.. సీమెన్స్ (Siemens) కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేదే?.. సీమెన్స్ సంస్థను ప్రతివాదిగా ఎందుకు చేర్చలేదు.. ఒక్క రూపాయి అయినా పక్కదారి పట్టిందని నిరూపించగలరా? అని పయ్యావుల సూటిగా ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా ఏ ఒక్కరోజైనా నోటీసు ఇవ్వలేదు.. ప్రజా వ్యతిరేకతను దృష్టి మళ్లించేందుకే జగన్ ప్రయత్నాలు అని స్పష్టం చేశారు. ఒప్పందం చేసుకున్న సీమెన్స్‌ను కోర్టు పరిధిలోకి ఎందుకు తీసుకురావట్లేదో అర్థం కావడంలేదు.. నిజాలు వెలుగులోకి వస్తాయనే సీమెన్స్‌ను పక్కన పెడుతున్నారు అని తెలిపారు. ఆరోపణ చేసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఓటమి భయంతోనే టీడీపీ, చంద్రబాబుపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
విచారణ ఎదుర్కొనే ధైర్యం లేకనే... రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ (Kanakamedala Ravindra Kumar) మాట్లాడుతూ.. ప్రభుత్వం వారం రోజులు సమయం కోరడం సాగదీత ధోరణే అని అన్నారు. కోర్టులో విచారణ ఎదుర్కోలేక డొంకతిరుగుడుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు ఎదుర్కోలేక చేసే పిరికిపంద చర్యగా కనకమేడల అభివర్ణించారు. న్యాయప్రక్రియను కూడా అడ్డుకోవాలని జగన్ చూస్తున్నారని, చేసిన తప్పుల నుంచి జగన్ తప్పించుకోలేరని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందన్న ఆయన.. కక్షసాధింపు కోసం ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశ రాజకీయాల్లో ఈతరహా వ్యక్తిగత కక్షసాధింపు చర్యలు ఇప్పటివరకూ లేవని చెప్పారు.
తప్పుడు పత్రాలు, అసత్య ఆరోపణలు... సత్తెనపల్లిలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ..(Kanna Lakshminarayana) తప్పుడు పత్రాలు, అసత్య ఆరోపణలతో చంద్రబాబుపై కేసు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ వంటి మంచి కార్యక్రమానికి అవినీతిని ఆపాదించడం దుర్మార్గమైన చర్యఅంటూ ఆరోపించారు. జగన్ అవినీతి రాజకీయాలపై ప్రజా ఉద్యమాలు, వీధి పోరాటాలు చేస్తామని కన్నా హెచ్చరించారు. ప్రజలను చైతన్యవంతులను చేసి అరాచక ప్రభుత్వాన్ని సాగనంపుతామని కన్నా పేర్కొన్నారు. ఇప్పటికైనా కక్షసాధింపురాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు.
కేంద్ర పెద్దలు మౌనం వహించడం దేనికి సంకేతం?... ఏపీ పరిణామాలు దిల్లీ పెద్దలకు కనబడట్లేదా? అంటూ అయ్యన్నపాత్రుడు(Chintakayala Ayyanna Patrudu) కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టులో దిల్లీ పెద్దల పాత్ర ఉన్నందుకే మాట్లాడట్లేదా? అంటూ అనుమానం వ్యక్తం చేశారు. కేంద్ర పెద్దలు మౌనం వహించడం దేనికి సంకేతమంటూ అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే నిధులు తినేస్తున్న జగన్ చర్యలు కేంద్రపెద్దలకు కనిపించట్లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ దిగజారి పనిచేస్తున్నాయని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ చూడలేదని, ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
కార్పొరేషన్‌లో అక్రమాలు జరిగాయని మాజీ సీఎంపై కేసు పెడతారా? బాధ్యులైన అధికారులను ప్రశ్నించరా? అంటూ తెలుగుదేశం నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ బూట్ల కింద సీఐడీ నలిగిపోతోందని ఆయన ఆరోపించారు. 40 నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాలు ఉన్నాయని వెళ్లి చూసుకోండని తెలిపారు. మంత్రులు ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. వైసీపీ నేతల పాపాలు పండాయి.. అన్నీ అనుభవిస్తారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు.