అక్రమాస్తుల కేసులో ఇటీవల సస్పెన్షన్‌కు గురైన ఛత్తీస్‌గఢ్ ఐపీఎస్ అధికారి జీపీ సింగ్‌పై పోలీసులు దేశద్రోహం కేసు(Sedition charges) నమోదు చేశారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు(ఏసీబీ), ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్(ఈఓడబ్ల్యూ) అధికారులు నిర్వహించిన సోదాల్లో ప్రభుత్వ, ప్రజా ప్రతినిధులకు వ్యతిరేకంగా కుట్రకు సంబంధించిన కీలక పత్రాలు లభ్యమవ్వగా ఆయనపై ఈ చర్యలు తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్స్ 124-ఏ(దేశద్రోహం), 153-ఏ కింద రాయ్‌పుర్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్లో గురువారం అర్ధరాత్రి కేసు నమోదు చేశారు.
రూ.10 కోట్ల విలువైన..
జీపీ సింగ్‌కు చెందిన 15 ప్రాంతాల్లో జులై 1 నుంచి 3 వరకు ఏసీబీ/ఈఓడబ్ల్యూ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.10 కోట్ల విలువైన అక్రమ స్థిర, చరాస్తులను గుర్తించారు. దీంతో ఆయనను జులై 5న సస్పెండ్ చేశారు. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన జీపీ సింగ్ అంతుకుముందు ఏసీబీ, ఈఓడబ్ల్యూకు ఏడీజీగా పనిచేయడం గమనార్హం. అనంతరం ఆయన ఛత్తీస్‌గఢ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్(ఏడీజీ)గా నియమితులయ్యారు.
చిరిగిన పత్రాల్లో..
పెన్షన్ బాదాలోని జీపీ సింగ్ అధికారిక నివాసంలో ఏసీబీ/ఈఓడబ్ల్యూ నిర్వహించిన సోదాల్లో.. ఆ ఇంటి వెనక కొన్ని చిరిగిన పత్రాలను అధికారులు గుర్తించారు. వాటిని కలిపి చూడగా... కుట్రకు సంబంధించిన సమాచారం లభ్యమైందని తెలిపారు. "ఈ పత్రాల్లో ప్రముఖ రాజకీయ నేతలపై కుట్రకు తెరతీసే అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయి. అంతేకాకుండా.. ప్రజాప్రతినిధులకు చెందిన రహస్య సమాచారం, సంబంధిత నియోజకవర్గాల తీవ్రమైన సమస్యల గురించి రాసి ఉంది. ప్రభుత్వ పథకాలు, విధానాలు, సాంఘిక, మతపరమైన అంశాలపై తీవ్రమైన వ్యాఖ్యలు రాసి ఉన్నాయి" అని అధికారులు చెప్పారు. మరోవైపు.. జీపీ సింగ్ అసోసియేట్ మణి భూషణ్ ఇంట్లో కూడా ఇలాంటి పత్రాలనే తాము స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
ఏసీబీ, ఈఓడబ్ల్యూ స్వాధీనం చేసుకున్న పత్రాలకు సంబంధించిన నివేదిక ఆధారంగా జీపీ సింగ్‌పై తాము చర్యలు తీసుకున్నామని రాయ్‌పుర్ ఎస్ఎస్పీ అజయ్ యాదవ్ తెలిపారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: రూ.కోటి విలువ చేసే ఐఫోన్లు సీజ్
ఇదీ చూడండి: 'ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముసాయిదా'