రాజకీయాల నుంచి మతాన్ని వేరు చేస్తేనే.. విద్వేష ప్రసంగాలకు తెర పడుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విద్వేష ప్రసంగాలపై దాఖలైన పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అనేక సార్లు మినహాయింపులు ఇచ్చినప్పటికీ.. ప్రజలు ఎందుకు తమను తాము విద్వేష ప్రసంగాలు చేయకుండా అదుపు చేసుకోలేకపోతున్నారని సందేహం వ్యక్తం చేసింది. మాజీ ప్రధాన మంత్రులు జవహర్ లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రసంగాలను ఉదహరించిన బెంచ్.. వారి మాటలు వినేందుకు గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చేవారని ఈ సందర్భంగా గుర్తు చేసింది. అన్ని వర్గాల ప్రజలు విద్వేష ప్రసంగాలు చేయకుండా ప్రతిజ్ఞ ఎందుకు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించింది. రోజూ ఎవరో ఒకరు ఇతరులను అవమానించేలా.. విద్వేష వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారని చెప్పింది. కానీ అనేక రాష్ట్రాలు వారిపై కేసులు నమోదు చేయడంలో విఫలం అవుతున్నాయని అసహనం వ్యక్తం చేసింది. జస్టిస్ కెఎం జోసేఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
అంతకుముందు మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో మత సామరస్యాన్ని కాపాడుకునేందుకు విద్వేషపూరిత ప్రసంగాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించి 18 కేసులు నమోదు చేసినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. కేవలం కేసుల నమోదుతో ఈ సమస్య పరిష్కారం కాదని.. FIRల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని సొలిసిటర్ జనరల్‌ను ప్రశ్నించింది.
విద్వేష ప్రసంగాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు అనేక సార్లు పేర్కొంది. ఫిర్యాదు కోసం ఎదురుచూడకుండా సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఇప్పటికే ఆదేశించింది. ఎంతో తీవ్రమైన ఈ సమస్యపై చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం ఏదైనా జాప్యం చేస్తే.. కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని కూడా హెచ్చరించింది.
'యూనిఫాం లా' పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం
వివాహం, విడాకులు, వారసత్వం లాంటి అంశాలకు మతం, లింగం ప్రాతిపదికన యూనిఫాం చట్టాలు రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ అంశాలన్నీ శాసన వ్యవస్థ పరిధిలోకి వస్తాయని.. చట్టాలు చేయాలంటూ పార్లమెంట్‌ను ఆదేశించలేమని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది. అశ్వినీ ఉపాధ్యాయ్ అనే న్యాయవాది ఐదు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు.
ఇవీ చదవండి : దారి చూపిన ఫైజల్.. రాహుల్‌కు లైన్ క్లియర్!.. అనర్హత వేటు వెనక్కే?
కర్ణాటకలో మోగిన ఎన్నికల నగారా.. పోలింగ్, కౌంటింగ్ తేదీలివే..