విద్వేష ప్రసంగాలు చేసిన వారిపై ఫిర్యాదులు అందకపోయినా.. కేసు నమోదు చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే విషయమై 2022లో 3 రాష్ట్రాలకు వర్తించేలా ఇచ్చిన తీర్పు పరిధిని విస్తరిస్తూ.. శుక్రవారం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. కేసులు నమోదు చేయడం ఆలస్యం చేస్తే.. కోర్టు ధిక్కారంగా భావిస్తామని స్పష్టం చేసింది. విద్వేషపూరిత ప్రసంగం చాలా తీవ్రమైన అంశమని.. ఇది దేశ లౌకికత్వాన్ని ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడింది. మతంతో సంబంధం లేకుండా 2022 అక్టోబర్ 21న ఇచ్చిన తీర్పు అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. న్యాయమూర్తులు రాజకీయాలకు అతీతులని.. వారు కేవలం భారత రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టకుని తీర్పులిస్తారని చెప్పింది.
అంతకుముందు 2022లో జర్నలిస్ట్ షహీన్ అబ్దుల్లా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. దేశ లౌకికత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఫిర్యాదు అందకపోయినా.. కేసులు నమోదు చేయాలని ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, దిల్లీ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. 2022 అక్టోబర్ 21న ఇచ్చిన తీర్పును అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించాలని షహీన్ మరోసారి పిటిషన్ దాఖలు చేశారు.
'రాజకీయాల నుంచి మతాన్ని వేరు చేస్తేనే విద్వేష ప్రసంగాలకు తెర'
విద్వేషపూరిత ప్రసంగాలపై సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే అనేక సార్లు అసహనం వ్యక్తం చేసింది. అంతకుముందు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. రాజకీయాల నుంచి మతాన్ని వేరు చేస్తేనే.. విద్వేష ప్రసంగాలకు తెర పడుతుందని వ్యాఖ్యానించింది. అనేక సార్లు మినహాయింపులు ఇచ్చినప్పటికీ.. ప్రజలు ఎందుకు తమను తాము విద్వేష ప్రసంగాలు చేయకుండా అదుపు చేసుకోలేకపోతున్నారని సందేహం వ్యక్తం చేసింది. మాజీ ప్రధాన మంత్రులు అటల్ బిహారీ వాజ్పేయీ, జవహర్ లాల్ నెహ్రూ ప్రసంగాలను ఉదహరించిన బెంచ్.. వారి మాటలు వినేందుకు గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చేవారని ఈ సందర్భంగా గుర్తు చేసింది. అన్ని వర్గాల ప్రజలు విద్వేష ప్రసంగాలు చేయకుండా ప్రతిజ్ఞ ఎందుకు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించింది. రోజూ ఎవరో ఒకరు ఇతరులను అవమానించేలా.. విద్వేష వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారని చెప్పింది. కానీ అనేక రాష్ట్రాలు వారిపై కేసులు నమోదు చేయడంలో విఫలం అవుతున్నాయని అసహనం వ్యక్తం చేసింది. జస్టిస్ కెఎం జోసేఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఇవీ చదవండి : 'ఉగ్రమూకలకు ఆశ్రయం కల్పిస్తే.. వారికే ముప్పు'.. SCO రక్షణ మంత్రుల భేటీలో రాజ్నాథ్
'సోనియా గాంధీ 'విషకన్య'.. చైనా, పాక్కు ఏజెంట్గా విధులు!'.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు