Lying On Thorns: సంప్రదాయం పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వింత ఆచారాలు ఇప్పటికీ ఉన్నాయి. అలాంటివి పాటించడం ఏమాత్రం మంచిది కాదని తెలిసినా.. వాటిని మానడానికి మాత్రం ఒప్పుకోరు. ఇలాంటి మూఢ విశ్వాసాలకు మరో ఉదాహరణ మధ్యప్రదేశ్ బైతూల్ జిల్లాలో వెలుగు చూసింది. ఇక్కడి ఓ గ్రామానికి చెందిన కొంతమంది.. ముళ్లకంపపై పడుకుని దొర్లుతున్నారు.
Descendants of Pandavas: బైతుల్ జిల్లా సెహరా గ్రామంలోని రజ్జడ్ తెగ ప్రజలు తాము పాండవుల వారసులమని చెప్పుకుంటున్నారు. పురాణాల్లో పాండవులు తమ సత్యనిబద్ధతను నిరూపించుకునేందుకు ముళ్ల కంపపై దొర్లారని.. అదే తరహాలో ఇప్పుడు తామూ ఆ ఆచారాన్ని పాటిస్తున్నామని వారు అంటున్నారు. ఏటా అగ్హన్ మాసంలో ముళ్ల కంపపై రజ్జడ్ తెగ ప్రజలు దొర్లుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల దేవుడు సంతోషించి, తమ కోరికలు నెరవేరుస్తాడని వారు నమ్ముతారు. ముళ్లపై దొర్లిన అనంతరం తమ సోదరికి వారు వీడ్కోలు పలుకుతారు.
పాండవుల కథేంటి అంటే..?
Superstition: వనవాస సమయంలో అడవిలో తిరుగుతుండగా.. పాండవులకు ఓ రోజు బాగా దాహం వేస్తుంది. ఎక్కడ వెతికినా నీళ్లు దొరకవు. చాలా దూరం ప్రయాణించాక వారికి నాహల్ తెగకు చెందిన ఓ వ్యక్తి తారసపడతాడు. అతడిని నీటి జాడ చెప్పమని పాండవులు అభ్యర్థిస్తారు. అందుకు ఆ నాహల్ తెగ వ్యక్తి.. ఓ షరతు విధిస్తాడు. 'మీ చెల్లెలితో నాకు వివాహం జరిపిస్తేనే నీళ్లు ఎక్కడ దొరుకుతాయో చెబుతాను' అని అంటాడు. దానికి పాండవులు ఒప్పుకుంటారు. అయితే... పాండవులకు సోదరి లేదు కాబట్టి.. వాళ్లు భోందాయ్ అనే పేరు ఉన్న ఓ మహిళను తమ చెల్లెలుగా స్వీకరించి... ఆ నాహల్తో పెళ్లి జరిపిస్తారు. అప్పగింతల సమయంలో పాండువులు తమ సత్యనిబద్ధతను నిరూపించుకోవాలంటే ముళ్లపై పడుకుని దొర్లాలని నాహల్ కోరతాడు. దాంతో పాండవులు ఒకరి తర్వాత మరొకరు ముళ్ల కంపపై పడుకుని దొర్లుతారు. ఆ తర్వాత తమ సోదరిని పాండవులు నాహల్తో సాగనంపుతారు.
ఇదీ చూడండి: తాతా-మనవడి ఉమ్మడి విజయం.. ఒకేసారి డిప్లొమా పాస్
యాభై తరాలుగా..
Rajjad community: తాము పాండవుల వారసులం అని నమ్మే రజ్జడ్ తెగ ప్రజలు కూడా పాండవుల లానే.. ముళ్లపై పడుకుని దొర్లుతూ ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇలా తాము గత యాభై తరాల నుంచి చేస్తున్నామని వారు చెబుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఐదు రోజులపాటు రజ్జడ్ తెగ ప్రజలు జరుపుకుంటారు. చివరి రోజున ఇలా ముళ్ల కంపపై పడుకుని దొర్లుతారు.
'మంచిది కాదు'
అయితే.. రజ్జడ్ తెగ పాటిస్తున్న ఈ సంప్రదాయాన్ని చాలా మంది మూఢ నమ్మకమని తోసిపుచ్చుతున్నారు. ఇలా ముళ్లపై పడుకుని దొర్లడం ఏమాత్రం మంచిది కాదని డాక్టర్ రాను వర్మ తెలిపారు. దాని వల్ల శరీరానికి తీవ్ర గాయాలవుతాయని.. అనేక రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయని చెప్పారు. ఒక్కోసారి ప్రాణహాని కూడా తలెత్తవచ్చని హెచ్చరించారు.
ఇదీ చూడండి: పీటీ ఉషపై '420' కేసు.. రియల్ ఎస్టేట్ వివాదంతో...