Subhash Chandra Bose Education: ప్రభావతీబోస్, జానకీనాథ్ బోస్‌ల 14 మంది సంతానంలో తొమ్మిదోవాడు సుభాష్‌చంద్ర బోస్. 1897 జనవరి 23న ఆయన పుట్టే నాటికి జానకీనాథ్ బ్రిటిష్ ప్రభుత్వ ప్లీడర్‌గా కటక్‌లో పనిచేసేవారు. పండగలకు తమ సొంతూరు కోల్‌కతాకు వెళ్లేవారు. సుభాష్ బాల్యమంతా కటక్‌లోనే సాగింది. ప్రొటెస్టెంట్ యూరోపియన్ స్కూల్లో.. ఇంగ్లిష్, లాటిన్, బైబిల్, బ్రిటిష్ చరిత్ర చదువుకున్నాడు. ఇంట్లో తల్లి ద్వారా మహాభారతం, రామాయణం, బెంగాలీ కథలు, దుర్గా, కాళీ, రామకృష్ణ పరమహంస, వివేకానందుడి గురించి తెలిసింది. 12 ఏళ్ల వయసులో బడి మారటంతో అక్కడ బెంగాలీ, సంస్కృతాలతో పరిచయమైంది. మెట్రిక్యులేషన్ పరీక్షలో రాష్ట్రస్థాయిలో అగ్రశ్రేణిలో నిలిచాడు. ఈ క్రమంలో తండ్రి ఆయన్ను సంపన్నులు చదివే కోల్‌కతాలోని ప్రఖ్యాత ప్రెసిడెన్సీ కళాశాలలో పాశ్చాత్య తత్వశాస్త్ర కోర్సులో చేర్చారు.. అలా బోస్ పయనం తండ్రి కోరుకున్న బాటలోనే కొనసాగింది.
నోరుజారిన ప్రొఫెసర్..
Subhash Chandra Bose Biography: 1916 ఫిబ్రవరిలో ఓ రోజు.. చరిత్ర ఆచార్యుడు ఎడ్వర్డ్ ఫేర్లీ ఓటెన్ పాఠం చెబుతూ.. భారతీయ సంస్కృతి, భారతీయుల గురించి నీచంగా మాట్లాడాడు. కొంతమంది భారతీయ విద్యార్థులపై చేయి కూడా చేసుకున్నాడు. ఇది 19 ఏళ్ల బోస్‌తో పాటు అనేక మంది భారతీయ విద్యార్థుల రక్తాన్ని ఉడికించింది. కొద్దిరోజుల తర్వాత విద్యార్థులంతా ఓటెన్‌ను కాలేజీ మెట్లపై నుంచి తోసేసి... దాడిచేసినంత పనిచేశారు. గాయాలేమీ కానప్పటికీ తనను కొట్టిందెవరో ఓటెన్ గుర్తించలేకపోయాడు. కాలేజీ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. చివరకు.. ఆ రోజు సంఘటన తర్వాత బోస్ అక్కడి నుంచి పారిపోతుంటే చూశామంటూ అటెండర్ సాక్ష్యం చెప్పటంతో.. ఆయనే ఈ దాడికి సూత్రధారి, పాత్రధారి అని బోస్‌ను కాలేజీ నుంచే కాకుండా.. కోల్‌కతా యూనివర్సిటీ నుంచే బహిష్కరించారు. బోస్‌లో ఈ సంఘటన జాతీయ భావనలను రేకెత్తించగా.. ఆయన తండ్రి దీన్ని అవమానంగా భావించారు. అప్పటికే జాతీయోద్యమం, విప్లవవాదం బెంగాల్‌లో విస్తృతమయ్యాయి. ఉడుకురక్తం ఎటు పరుగులు పెడుతుందోననే ఆందోళనతో జానకీనాథ్ తన మిత్రుడైన కోల్‌కతా వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ అశుతోష్ ముఖర్జీతో మాట్లాడారు. చివరకు బోస్‌కు మరో కాలేజీలో (స్కాటిష్ చర్చ్ కాలేజీ) మళ్లీ సీటు ఇప్పించారు. 1918లో తత్వశాస్త్రంలో బీఏ(ఆనర్స్)ను ప్రథమశ్రేణిలో పాసైన ఆయన్ను తండ్రి వెంటనే ఇంగ్లాండ్‌కు పంపించారు. అక్కడ ఇండియన్ సివిల్ సర్వీసెస్ (ఐసీఎస్) పరీక్షకు కూర్చోబెట్టారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేరటంతో పాటు.. ఐసీఎస్‌కూ సిద్ధమయ్యాడు బోస్. ఆ ఏడాది (1920) ఐసీఎస్‌లో కేవలం ఆరు సీట్లు మాత్రమే ఉండగా... ఓపెన్ కాంపిటేషన్‌లో నాలుగోస్థానంలో నిలిచి ఐసీఎస్ ప్రొబెషనర్‌గా ఎంపికయ్యాడు. మరో రెండు సబ్జెక్ట్‌లు, గుర్రపు స్వారీ పరీక్ష పూర్తి చేస్తే ఐసీఎస్ అధికారిగా భారత్‌కు వచ్చేయటమే మిగిలి ఉందిక!
నాకొద్దు ఐసీఎస్
Subhash Chandra Bose ICS Exam: ఈ దశలో.. బోస్‌లో మళ్లీ జాతీయ భావనలు పురివిప్పాయి. తండ్రికి, అన్నయ్య శరత్‌చంద్రబోస్‌కు లేఖలు రాశారు. తన ప్రగతిశీల ఆలోచనలకు ఇది పొసగదని.. ఈ ఐసీఎస్ సంకెళ్లతో దేశానికి సేవ చేయలేనని తన అశక్తతను వ్యక్తంజేశారు. చివరకు 1921 ఏప్రిల్‌లో ఐసీఎస్ తుది పరీక్ష రాయబోనని నిర్ణయించుకున్నారు. అదే విషయం కుటుంబంతో పాటు బ్రిటన్‌లో భారత వ్యవహారాల మంత్రి ఎడ్విన్ మాంటెగూకు సైతం స్పష్టం చేశారు. 'నా పేరును ఐసీఎస్ ప్రొబెషనర్ల జాబితా నుంచి తొలగించండి. ఇప్పటిదాకా నాపై బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ఖర్చును తిరిగి ఇచ్చేస్తాను' అంటూ మాంటెగూకు లేఖ రాశారు బోస్. చివరకు కేంబ్రిడ్జిలో కూడా తన చదువును పూర్తి చేయకుండానే భారత్‌కు తిరిగి వచ్చి జాతీయోద్యమంలో చేరారు.
Subhash Chandra Bose Death: 1945లో విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ చనిపోయారనే విషయం తెలిశాక... కాలేజీ నుంచి తన బహిష్కరణకు కారణమైన ప్రొఫెసర్ ఎడ్వర్డ్ ఓటెన్ సంతాప సందేశం పంపటం విశేషం. బోస్ సేవలను, ధైర్యాన్ని, పోరాట స్ఫూర్తిని కీర్తిస్తూ.. గ్రీకు వీరుడితో ఆయన్ను పోలుస్తూ.. ఇంగ్లాండ్‌లో విశ్రాంత జీవితం గడుపుతున్న ఓటెన్ ఘన నివాళి అర్పించారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: నేతాజీ మిస్టరీలో ట్విస్ట్... అస్థికలకు డీఎన్‌ఏ టెస్ట్ ఎందుకు చేయలేదు?