Missing: నెల్లూరు జిల్లా తోడేరు శాంతినగర్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. గ్రామ చెరువులో సరదాగా చేపలు పట్టేందుకు వెళ్లిన 10 మంది యువకుల్లో ఆరుగురు గల్లంతవడం విషాదం నింపింది. పది మందిలో నలుగురు యువకులు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. గల్లంతైన ఆరుగురి మృతదేహాలను ఈరోజు మధ్యాహ్నం తర్వాత పోలీసులు, సహాయక సిబ్బంది వెలికి తీశారు. గల్లంతైన వారి కోసం ఆదివారం సాయంత్రం నుంచి తీవ్రంగా గాలించారు. ఈ ఘటన మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్వగ్రామం తోడేరులో జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అసలేం జరిగింది: ఆదివారం సాయంత్రం సరదాగా గ్రామ చెరువులో చేపలు పట్టేందుకు పడవలో వెళ్లిన 10 మంది యువకులు పడవ బోల్తా పడటంతో నీటిలో పడ్డారు. వారిలో నలుగురు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా మరో ఆరుగురు గల్లంతైయ్యారు. మన్నూరు కల్యాణ్ (30), అల్లి శ్రీనాథ్ (16), పాటి సురేంద్ర (16), పముజుల బాలాజీ (20), బట్టా రఘు (25), చల్లా ప్రశాంత్‌కుమార్ (26)లు గల్లంతయ్యారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఈరోజు మధ్యాహ్నం వరకు మన్నూరు కల్యాణ్ (30), అల్లి శ్రీనాథ్ (16), పముజుల బాలాజీ (20), బట్టా రఘు (25), చల్లా ప్రశాంత్‌కుమార్ (26) మృతదేహాలు లభ్యం కాగా.. గల్లంతైన మరో వ్యక్తి పాటి సురేంద్ర కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. మధ్యాహ్నం తర్వాత అతని మృతదేహాన్ని పోలీసులు బయటికి తీశారు.
ఘటన సమాచారం తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈత గాళ్లతో గాలింపు చేపట్టారు. చెరువులో బురద ఎక్కువగా ఉండటం, చీకటి పడటం కారణంగా గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. అర్ధరాత్రి దాకా యువకుల ఆచూకీ తెలియలేదు. హైదరాబాద్‌లో ఉన్న మంత్రి కాకాణి ఘటన గురించి తెలియగానే తోడేరుకు బయల్దేరారు. సహాయ చర్యలు మరింత ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్‌బాబు, ఎస్పీ విజయరావు సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆదివారం రాత్రి నుంచి ఎస్పీ విజయరావు పోలీసు, అగ్ని మాపక సిబ్బందితోనే ఉండి వారికి సూచనలు చేశారు.
అయితే మునిగిపోయిన ప్రాంతం 20 మీటర్ల లోతు ఉంటుందని.. బురద ఉన్నందు వల్ల బయటికి రాలేక చనిపోయినట్లు సమాచారం. అయితే గల్లంతైన వారందరికీ ఈత వచ్చని గ్రామస్థులు తెలిపారు. మృతుల కుటుంబాలను ముఖ్యమంత్రి జగన్ ఆదుకుంటాడని మంత్రి కాకాణి భరోసా ఇచ్చారు.
ఇవీ చదవండి: