ఉత్తర్‌ప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో దారుణం జరిగింది. పరీక్ష ముగించుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ విద్యార్థినిని బైక్‌పై వచ్చి అత్యంత కిరాతకంగా కాల్చిచంపారు ఇద్దరు యువకులు. పట్టపగలే పోలీస్ స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరగడం వల్ల ఆ ప్రాంతంలో కలకలం రేగింది. బాలికపై కాల్పులు జరిపిన పిస్టల్‌ను దుండగులు ఘటన స్థలంలోనే వదిలి వెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
జలౌన్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి సోమవారం బీఏ పరీక్ష రాసేందుకు కళాశాలకు వెళ్లింది. మధ్యాహ్నం పరీక్ష పూర్తి చేసుకుని కొట్రా తిరాహె ప్రాంతం నుంచి ఇంటికి తిరిగి వెళ్తోంది. అదే సమయంలో ఒక్కసారిగా వెనక నుంచి ఇద్దరు గుర్తుతెలియని యువకులు బైక్‌పై వచ్చారు. ఆపై వెంట తెచ్చుకున్న పిస్టోల్‌తో ఓ యువకుడు విద్యార్థిని తలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఆ యువతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఇది గమనించిన కొందరు స్థానికులు వారిని వెంబడించి పట్టుకునే ప్రయత్నించారు. నిందితులు.. తూపాకీని అక్కడే వదిలి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఫోరెన్సిక్ బృందంతో ఘటనా స్థలానికి చేరుకొని పలు ఆధారాలను సేకరించారు. అనంతరం యువతి మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఘటనకు సంబంధించిన దృశ్యాల కోసం అక్కడే ఉన్న కొన్ని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని.. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు కొట్రా తిరాహే అదనపు పోలీసు సూపరింటెండెంట్ అసిమ్ చౌదరీ తెలిపారు. ప్రాథమిక సాక్ష్యాలను బట్టి ఓ ప్రేమికుడు తనను ప్రేమను నిరాకరించిందనే కోపంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని గ్రామస్థులు అంటున్నారు. ఈ కేసులో స్థానికులతో పాటు మృతురాలి కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కూడా సేకరించారు పోలీసులు. దీని ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
యువకుడి వేధింపులు.. 16 ఏళ్ల బాలిక సూసైడ్
ఉత్తర్‌ప్రదేశ్‌లో యువకుడి వేధింపులు తాళలేక ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న ప్రీతి గుప్తా అనే 16 ఏళ్ల విద్యార్థిని భతాత్ ప్రాంతంలోని తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉరి వేసుకుని చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. బాలిక మరణానికి కారణమైన ఓ యువకుడిని, అతడి సోదరుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా భతాత్ పోలీస్ పోస్ట్ ఇన్‌ఛార్జ్ కమలేశ్ సింగ్ తెలిపారు. శవపరీక్షల నిమిత్తం బాలిక మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.