ఈ అమ్మాయి పేరు రోష్ణీ. రోజూ 24 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ బడికి వెళ్లి, బంగారు భవిష్యత్తుకు స్వయంగా తానే బాటలు పరుచుకుంది. మనసుంటే మార్గముంటుందన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. భిండ్ జిల్లాలోని అజ్నైల్ అనే మారుమూల గ్రామాని కి చెందిన రోష్ణీ.. 10 వ తరగతి పరీక్షల్లో 98.5 మార్కులతో రాష్ట్రంలోనే 8వ ర్యాంకు కైవసం చేసుకుంది. మధ్యప్రదేశ్ మహిళా, శిశు అభివృద్ధి విభాగానికి ఈ బాలిక అంబాసిడర్‌గా నియమితురాలైంది. కష్టమని భావించకుండా రోజూ 24 కిలోమీటర్లు సైకిల్‌పై బడికి వెళ్లడమే ఈ విజయం సాధించేలా చేసింది.
వరదలు ముంచెత్తినా..
ఈ వార్త విన్న తర్వాత రోష్ణీ కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు. చదువుకోవాలన్న సంకల్పం బలంగా ఉండేది రోష్ణికి. కానీ.. పాఠశాల తమ ఊరి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉండేది. బడికి వెళ్లి వచ్చేందుకు 24 కిలోమీటర్లు ప్రయాణం చేయక తప్పని పరిస్థితి. అయినా రోజూ బడికి వెళ్లిందే తప్ప.. ఎన్నడూ వెనకడుగు వేయలేదు. వర్షాకాలంలో వరదలు ముంచెత్తినా.. ఆ ఊర్లో ఉండే బంధువుల ఇంటి నుంచే బడికి వెళ్లేది కానీ, మానేసేది కాదు. రోష్ణీ తండ్రి పురుషోత్తం భదౌరియా ఓ సాధారణ రైతు. తన కుమార్తె సాధించిన విజయం పట్ల ఎంతో గర్వంగా ఉందని చెప్తున్నాడు.
"కొన్నేళ్ల క్రితం వరకూ మా ఊర్లో బడి ఉండేది కాదు. నా కుమార్తెను భుజాలపై ఎక్కించుకుని, బడికి తీసుకెళ్లేవాడిని. వంతెన కట్టిన తర్వాత చదువులో రోష్ణీ మరింత చురుగ్గా మారింది. ప్రభుత్వం నుంచి ఉచిత సైకిల్ అందుకుంది. అప్పటినుంచీ మేఘావ్లో ఉన్న బడికి సైకిల్‌పై వెళ్లివచ్చేది. నేను రైతుగా సంపాదించేది అంతంతమాత్రమే అయినా.. నా బిడ్డను ఉన్నత చదువులు చదివించేందుకు ఎంత కష్టమైనా పడతా."
- పురుషోత్తం భదౌరియా, రోష్ణీ తండ్రి
గురువులకు సన్మానం..
ఐఏఎస్ అధికారి కావాలని కలలుగంటున్న రోష్ణి.. మంచి మార్కులు సాధించి, గురు పూర్ణిమ సందర్భంగా తన గురువులకు నిజమైన సన్మానం చేసింది.
ఇదీ చదవండి: 'గాడ్సే' లైబ్రరీ ప్రారంభించిన హిందూ మహాసభ
"మొదటినుంచీ రోష్ణి చురుగ్గా ఉండేది. ఆటపాటలు సహా అన్ని విభాగాల్లోనూ ప్రతిభ చాటేది."
- హరిశ్చంద్ర శర్మ, ప్రిన్సిపల్
ఎంపీ మెప్పుతో..
మీడియాలో కథనాలు చూసిన అప్పటి మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి ఇమ్రతీదేవి రోష్ణీని ఆ విభాగానికి అంబాసిడర్‌గా నియమించారు. రాజ్యసభ ఎంపీ వివేక్ టంఖా రోష్ణీ ప్రతిభ మెచ్చుకుని.. ఉన్నత చదువులకు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ల్యాప్‌టాప్, ఆధునిక ఎలక్ట్రిక్ సైకిల్ బహుమతిగా ఇచ్చారు. 'ఈటీవీ భారత్' రోష్ణి గ్రామానికి వెళ్లి, ఆమెతో ముచ్చటించింది.
"చదువుకోవాలంటే కొన్ని సవాళ్లు ఎదుర్కోక తప్పదు. రోజూ 24 నుంచి 25 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుకుంటూ పాఠశాలకు వెళ్లేదాన్ని. వర్షం పడినప్పుడల్లా చాలా ఇబ్బందులే ఎదుర్కొనేదాన్ని. ఐఏఎస్ అధికారి కావడమే నా లక్ష్యం. బ్రాండ్ అంబాసిడర్ అంటే ఏమిటో కూడా నాకు తెలియదు. అయినా నాకు అప్పజెప్పిన బాధ్యత నెరవేర్చి.. ఆదర్శంగా నిలబడేందుకు శ్రమిస్తాను."
- రోష్ణీ భదౌరియా, విద్యార్థి
ఇదీ చదవండి: ఈ కైట్మ్యాన్ ఒంటి నిండా పతంగుల ఆభరణాలే