SP BJP stone pelting: ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలో భాజపా, సమాజ్‌వాదీ పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. గోసాయీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కబీర్‌పుర్‌లో ఇరుపార్టీల కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసు స్టేషన్ ఎదుటే ఈ ఘటన జరగడం విస్మయం కలిగిస్తోంది. కాల్పులు సైతం జరిగినట్లు తెలుస్తోంది.
Ayodhya SP stone pelting
గోసాయీగంజ్ నియోజకవర్గాన్ని భాజపా, ఎస్పీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. ఎస్పీ నుంచి అభయ్ సింగ్, భాజపా తరఫున ఎమ్మెల్యే ఇంద్ర ప్రతాప్ తివారి ఖబ్బూ సతీమణి ఆర్తీ తివారీ పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా రెండు వర్గాలకు చెందిన కార్లు ఎదురుపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. శుక్రవారం సాయంత్రం కాల్పులు సైతం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై ఎస్పీ నాయకులు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. ఘర్షణలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్‌పైనా రాళ్లు విసిరారు. దీంతో బలగాలను ఉపయోగించి ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.
BJP SP stone pelting
ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని ఎస్ఎస్పీ శైలేశ్ పాండే తెలిపారు. నాలుగు వాహనాలు ధ్వంసమైనట్లు గుర్తించామని వెల్లడించారు. తమపై దాడి జరిగిందని రెండు పార్టీల కార్యకర్తలూ ఆరోపణలు చేశారని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు ప్రచారమవుతున్నాయని, వాటిని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో శాంతియుత పరిస్థితులు ఉన్నాయని స్పష్టం చేశారు. ఘటనపై ఇరుపక్షాల నుంచి వివరాలు సేకరిస్తున్నామని, దాని ఆధారంగా దర్యాప్తు చేపడతామని తెలిపారు.
ఇదీ చదవండి: అఖిలేశ్ ఆశల విడత- యాదవ్‌ల మద్దతుపై ఎస్పీ ధీమా