No pollution certificate no petrol: పర్యావరణ కాలుష్యంపై కేజ్రీవాల్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. దేశ రాజధాని దిల్లీలో కాలుష్యాన్ని అరికట్టేందుకు పొల్యూషన్ సర్టిఫికెట్ను కలిగి ఉండడం తప్పనిసరి చేసింది. ఈ సర్టిఫికెట్ చూపిస్తేనే పెట్రోల్ బంకుల్లో ఇంధనం పట్టే నిబంధనను తీసుకురావాలని చూస్తోంది. ఇందుకు సంబంధించిన సలహాలు, సూచనలతో పాటు అభ్యంతరాలు ఉంటే తెలపాలని ప్రజలను కోరింది.
దిల్లీలో కాలుష్యాన్ని విడుదల చేసే వాహనాలను తిరగనీయకుండా.. దిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించేందుకు ఈ విధానం దోహదపడుతుందని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. పౌరులకు స్వచ్ఛమైన గాలిని అందించడానికి కేజ్రీవాల్ సర్కార్ కట్టుబడి ఉందని అన్నారు.
"వాహన యజమానులు కచ్చితంగా పొల్యూషన్ సర్టిఫికెట్ను పెట్రోల్ బంకుల వద్దకు తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. దానికి వ్యాలిడిటీ ఉంటేనే ఇంధనం నింపుతారు. వాస్తవానికి ఇది చాలా ప్రతిష్ఠాత్మకమైన విధానం. దిల్లీతోపాటు ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలు శీతాకాల సమయంలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తే కాలుష్య కోరల నుంచి రాష్ట్రాన్ని కొంతవరకు అయినా కాపాడొచ్చు."
-గోపాల్ రాయ్, దిల్లీ మంత్రి
అయితే ఈ సర్టిఫికెట్లను ప్రతీసారి చూడాలంటే వాహనదారులతో పాటు పెట్రోల్ పంపు యజమానులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. ఇలా పెద్దపెద్ద క్యూలు లేకుండా ఉండేలా ఈ పాలసీని సమర్థవంతంగా అమలు చేసేందుకు కొత్త సాంకేతికతను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోందని గోపాల్ రాయ్ తెలిపారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యమంత్రి కీలక సూచనలు