Singapore Prime Minister Lee Hsien Loong: భారత పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి సింగపూర్ ప్రధానమంత్రి లీ షిన్ లూంగ్ చేసిన వ్యాఖ్యలపై.. భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని సింగపూర్ హై- కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. సింగపూర్ ప్రధాని లూంగ్ వ్యాఖ్యలు ఆహ్వానించదగినవి కాదని పేర్కొన్నట్లు వెల్లడించాయి.
Singapore PM Remarks: సింగపూర్ పార్లమెంటులో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన ప్రధాని లూంగ్.. నేడు అనేక రాజకీయ వ్యవస్థలు తమ వ్యవస్థాపక నేతలను విస్మరిస్తున్నాయంటూ నెహ్రూ, ఇజ్రాయెల్‌కు చెందిన బెన్ గురియన్ ప్రస్తావన తెచ్చారు. ఇజ్రాయెల్‌లో రెండేళ్లకాలంలో నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరిగినట్లు చెప్పిన లూంగ్ ఎంతో మంది పార్లమెంటు సభ్యులపై నేరారోపణలు ఉండటమే కాకుండా వారిలో కొందరు జైళ్లకు వెళ్లినట్లు చెప్పారు.
అలాగే భారత పార్లమెంటు దిగువసభకు చెందిన ఎంపీల్లో సగం మందిపై అత్యాచారం, హత్య వంటి నేరారోపణలు పెండింగ్‌లో ఉన్నట్లు లూంగ్ చెప్పారు. అందులో అనేక కేసులు రాజకీయ ప్రేరేపితమన్నారు. తర్వాతి తరాలు సింగపూర్ వారసత్వాన్ని కాపాడటంతోపాటు వృద్ధిలోకి తీసుకెళ్లాలని లూంగ్ సూచించారు.
స్పందించిన కాంగ్రెస్..
సింగపూర్ ప్రధాని ప్రసంగంపై కాంగ్రెస్ స్పందించింది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఇప్పటికీ.. ప్రపంచ నేతలకు స్ఫూర్తి నింపుతూనే ఉన్నారని, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఆయనను పార్లమెంటు లోపలా, బయట కించపరుస్తూనే ఉన్నారని ఆరోపించింది.
ఇవీ చూడండి: 'మీ తప్పులు అంగీకరించకుండా.. నెహ్రూను బాధ్యుల్ని చేస్తారా?'