బంగాల్లోని చౌరింఘీ నియోజకవర్గంలో తమ అభ్యర్థిగా భాజపా ప్రకటించిన శిఖా మిత్రా అనూహ్య బాంబు పేల్చారు. తాను బరిలో దిగబోనని ప్రకటించారు. తన అనుమతి లేకుండానే టికెట్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ దివంగత నేత సోమెన్ మిత్రా భార్య శిఖా మిత్రా. బంగాల్లో తమ అభ్యర్థుల పేర్లతో కమలనాథులు గురువారం విడుదల చేసిన రెండో జాబితాలో ఆమె పేరుంది. చౌరింఘీలో శిఖా పోటీ చేయనున్నట్లు అందులో పేర్కొన్నారు. దాన్ని చూసి ఆమె అవాక్కయ్యారు.
"నేను పోటీ చేయట్లేదు. నా అనుమతి లేకుండానే నా పేరు ప్రకటించారు. నేను భాజపాలో చేరడం లేదు కూడా" అని శిఖా స్పష్టం చేశారు. గతవారం కేరళలోని మనంథవాడీ స్థానంలోనూ కమలదళానికి చౌరింఘీ తరహా పరిస్థితే ఎదురైంది. అక్కడ అభ్యర్థిగా బరిలో దిగుతారని 31 ఏళ్ల ఓ గిరిజన వ్యక్తి పేరు ప్రకటించగా.. పోటీ చేసేందుకు ఆయన నిరాకరించారు. ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
ఇదీ చదవండి:రిజర్వేషన్లు ఇంకెన్ని తరాలు?: సుప్రీం