మహిళ కంటిలోనుంచి రాళ్లు బయటకు వస్తున్న ఘటన కర్ణాటకలోని మైసూరులో వెలుగుచూసింది. బెంకిపురా గ్రామానికి చెందిన విజయ(35) అనే మహిళ కంటి నుంచి రాళ్లు పడుతున్నాయి. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశమైంది.
విజయ కంటి నుంచి రాళ్లు పడుతున్నాయని బెంకిపురా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జరీనా తాజ్‌కు తెలిసింది. ఆమె విజయను చల్లహళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి కంటి పరీక్షలు చేయించింది. వారు విజయకు కంటి సమస్య ఉన్నట్లు తెలిపారు. మెరుగైన కంటి పరీక్షల కోసం మైసూరుకు తరలించమని సిఫార్సు చేశారు.
"వారం రోజుల క్రితం తల నొప్పి వచ్చింది. తలపై నుంచి ఏదో దొర్లినట్లుగా అనిపించింది. అనంతరం కంటిలో నుంచి నీళ్లతో పాటు రాళ్లు పడ్డాయి. గత శనివారం నుంచి ఇప్పటివరకు 200కు పైగా రాళ్లు కంటిలో నుంచి బయటకు వచ్చాయి. ఆ సమయంలో కంటిలో నొప్పి వస్తుంది. ఈ విషయాన్ని గ్రామస్థులకు చెప్పాను. నేను అబద్దాలు చెబుతున్నానని కొందరు హేళన చేశారు."
--విజయ, బాధితురాలు
అయితే కంట్లో నుంచి రాళ్లు రావడానికి కచ్చితమైన కారణాలు తెలియలేదు. దీనిపై వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విజయకు కంటి పరీక్షలు నిర్వహించిన మైసూరులోని ప్రభుత్వాసుపత్రి వైద్యులు.. ఫలితాలు వస్తే గానీ ఇందుకు గల కారణం కచ్చితంగా తెలియదని చెబుతున్నారు. చిన్నతనంలో మట్టిని తింటే ఇలా కళ్లలో నుంచి రాళ్లు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. అయితే, విజయ అలా మట్టిని తినలేదని చెప్పినట్లు తెలిపారు.