మహారాష్ట్రలో విషాదకర ఘటన జరిగింది. 'మహారాష్ట్ర భూషణ్' అవార్డు ప్రదానోత్సవానికి వచ్చిన వారిలో 11 మంది వడదెబ్బ ప్రభావానికి ప్రాణాలు కోల్పోయారు. రాయ్‌గఢ్ జిల్లాలోని ఖార్ఘర్ ప్రాంతంలో బహిరంగంగా జరిగిన ఈ కార్యక్రమానికి లక్షల్లో ప్రజలు హాజరయ్యారు. తీవ్రమైన ఎండకు తట్టుకోలేక అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. 11 మంది మరణించారు. వడదెబ్బ వల్లే వీరంతా మరణించారని ఆదివారం రాత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. నవీ ముంబయి, పన్వేల్‌లోని ఆస్పత్రుల్లో పలువురు చికిత్స పొందుతున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. కొందరు వెంటిలేటర్లపై ఉన్నారని చెప్పారు.
సీఎంఓ ప్రకటనకు ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే నవీ ముంబయిలోని ఓ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడి ఆస్పత్రిలో 50 మంది అడ్మిట్ అయ్యారని తెలిపారు. అందులో 24 మందికి ఇంకా చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు. మిగిలినవారిని ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారని వివరించారు. మరణాలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం అందిస్తామని షిందే ప్రకటించారు. క్షతగాత్రుల ఆస్పత్రి ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. అవసరమైతే.. రోగులను ప్రత్యేక ఆస్పత్రులకు తరలించి వైద్యం అందేలా చూడాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.
"డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ర్యాంకు అధికారి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు. రోగుల బంధువులు, వైద్య బృందాలతో అధికారి సమన్వయం చేస్తారు. అవసరమైన సాయం చేసేందుకు అధికారిని నియమించాం. కార్యక్రమానికి లక్షలాది మంది వచ్చారు. ప్రదానోత్సవం బాగానే జరిగింది. సభకు వచ్చిన వారిలో కొంతమంది ఇబ్బందులు పడటం బాధాకరం."
-ఏక్నాథ్ షిందే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి
ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం హాజరయ్యారు. సామాజిక ఉద్యమకారుడు అప్పాసాహెబ్ ధర్మాధికారికి అవార్డును ప్రదానం చేశారు షా. ధర్మాధికారికి శాలువా కప్పి సన్మానించారు. మెమొంటోతో పాటు రూ.25లక్షల చెక్కు ఆయనకు అందించారు. 10 అడుగుల గులాబీల గజమాలను ధర్మాధికారి మెడలో వేశారు.
ధర్మాధికారికి రాష్ట్రంలో మంచి పేరు ఉంది. మొక్కలు నాటడం, రక్తదానం కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన పేరు సంపాదించారు. మెడికల్ క్యాంపులు, గిరిజన ప్రాంతాల్లో డీ-అడిక్షన్ క్యాంపులు సైతం నిర్వహించేవారు. మహారాష్ట్ర భూషణ్ అవార్డు ప్రకటించిన నేపథ్యంలో ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రదానోత్సవానికి విచ్చేశారు. ధర్మాధికారి నిర్వహించే 'శ్రీ సదస్య' సంస్థ సభ్యులు, అనుచరులు సైతం భారీగా తరలివచ్చారు. 306 ఎకరాల విస్తీర్ణంలోని గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరిగింది.