senior citizens quick darshan Karnataka : వయో వృద్ధులకు గుడ్‌న్యూస్ చెప్పింది కర్ణాటక ప్రభుత్వం. ఇక నుంచి 65 ఏళ్లు పైబడినవారు దైవ దర్శనం కోసం దేవాలయాల్లో క్యూలో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు కర్ణాటక దేవాదాయ శాఖ బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న 358 ఆలయాలకు ఈ నియమం వర్తిస్తుందని పేర్కొంది.
అర్చకుల సంఘం లేఖ..
senior citizens direct temple darshan : దేవాలయాల్లో సీనియర్ సిటిజన్లకు శీఘ్ర దర్శనానికి అనుమతించాలని కర్ణాటక హిందూ దేవాలయాల అర్చకుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆలయాల్లో 65 ఏళ్లు పైబడిన వారిని క్యూలో వేచి ఉండేలా కాకుండా ప్రత్యక్ష దర్శనానికి అనుమతించాలని కోరింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం వయో వృద్ధులకు శీఘ్ర దర్శనం అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
'ఇటీవల కాలంలో దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సీనియర్ సిటిజన్లు క్యూలో నిల్చొవడానికి ఇబ్బంది పడేవారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు ఇక నుంచి నేరుగా దైవ దర్శనం చేసుకోవచ్చు. వయసు నిర్ధరణ కోసం ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డును తెచ్చుకోవాలి' అని రాష్ట్ర దేవాదాయ కమిషనర్ తెలిపారు.
ఆలయాల్లో వృద్ధులకు క్యూలో వేచి ఉండకుండా.. నేరుగా దైవ దర్శనానికి అవకాశం ఇవ్వాలని అనేకసార్లు డిమాండ్లు వచ్చాయి. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆలయాల్లో వయో వృద్ధుల కోసం హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. సీనియర్ సిటిజన్స్‌కు వసతి కల్పించాలని.. వారు విశ్రాంతి తీసుకోవడం కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని సూచించారు. ఆలయాల్లో తాగునీరు, టాయిలెట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
దీంతో కర్ణాటకలో ప్రముఖ దైవ క్షేత్రాలైన కుక్కే శ్రీ సుబ్రహ్మణ్మ దేవాలయం, బెళగావిలో ఉన్న రేణుకా ఎల్లమ్మ దేవాలయాల్లో సీనియర్ సీటిజన్స్ క్యూలైన్లలో వేచి ఉండకుండా దర్శనం చేసుకోనున్నారు.
Congress Five Guarantees In Karnataka : ఇటీవల కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం 'శక్తి' పథకానికి ఏడాదికి రూ.3,200 నుంచి రూ.3,400 కోట్లు ఖర్చవ్వవచ్చని రవాణా శాఖ అధికారులు ఇటీవలే తెలిపారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకునేందుకు ఇటీవల కర్ణాటక కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.