Secunderabad Gold Theft Case Update : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ ఐటీ అధికారుల ముసుగులో బంగారం చోరీ ఘటనలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. 10 మంది నిందితులు ఈ దోపిడీకి పాల్పడినట్లు గుర్తించి.. వారిలో నలుగురిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. నిందితుల నుంచి 6 బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించిన పలు కీలక విషయాలు సీపీ వెల్లడించారు.
ఆ రెండు సినిమాలు చూసి దోపిడీకి పథకం..: అరెస్టు అయిన నలుగురు నిందితులు జాకీర్, రహీమ్, ప్రవీణ్, అక్షయ్‌లుగా సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. పరారీలో ఉన్న మరో ఆరుగురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామన్నారు. చోరీ చేసిన తర్వాత నిందితులంతా మహారాష్ట్రకు వెళ్లిపోయారని.. అక్కడికి వెళ్లి వారిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితుల్లో ఒకడైన జాకీర్ బంగారం దుకాణంలో పని చేస్తున్నాడన్న సీపీ.. దుకాణంలో పరిస్థితి చూసి తన మిత్రులకు చోరీ గురించి చెప్పాడని పేర్కొన్నారు. రెండు సినిమాలు చూసి దోపిడీకి పథకం పన్నినట్లు సీపీ చెప్పారు. అక్షయ్ కుమార్ నటించిన స్పెషల్ 26, సూర్య నటించిన గ్యాంగ్ సినిమా చూసి నిందితులు ఈ దోపిడీకి పథకం పన్నారని హైదరాబాద్ సీపీ ఆనంద్ వెల్లడించారు.
'ఈ నెల 27న సికింద్రాబాద్‌లోని బంగారం దుకాణంలో చోరీ జరిగింది. ఐటీ అధికారులుగా చెప్పుకుని ఆరుగురు వ్యక్తులు దుకాణంలోకి వెళ్లారు. తనిఖీల పేరుతో 17 బంగారం బిస్కెట్లు సేకరించారు. విస్తృత స్థాయిలో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నాం. సీసీ కెమెరాల ఆధారంగా వేగంగా దర్యాప్తు పూర్తి చేశాం. నిందితులు మహారాష్ట్రకు చెందిన వారు.'-సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ
Gold Theft in Pursuit of IT officials at Secunderabad : ఈ నెల 27న హైదరాబాద్‌లో రద్దీగా ఉండే మోండా మార్కెట్‌లోని బాలాజీ జ్యూవెలరీ దుకాణానికి ఉదయం ఐదుగురు వ్యక్తులు వచ్చారు. బంగారం కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారంటూ దుకాణం వద్దకు వచ్చి బెదిరించారు. దుకాణంలో ఉన్న బంగారం మొత్తం తనిఖీ చేయాలని సిబ్బందిని మొత్తం పక్కన కూర్చోబెట్టారు. షాపులో ఉన్న 1700 గ్రాముల బంగారానికి సంబంధించి ఎలాంటి ట్యాక్స్ చెల్లించలేదని, బంగారం స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్కడి నుంచి బంగారంతో ఉడాయించారు. ఈ క్రమంలోనే సిబ్బందిని షాపులోనే ఉంచి తలుపులు వేసి వెళ్లారు. అయితే అందులో ఉన్న వ్యక్తి(వికాస్) ఇతర దుకాణదారులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి ఆ తలుపులు తీశారు.
దీంతో దుకాణ యజమాని ఆ ప్రాంతంలో ఉన్న మిగతా జ్యూవెలరీ షాపుల యజమానులకు ఐటీ అధికారులు వచ్చి బంగారం స్వాధీనం చేసుకున్న విషయం చెప్పాడు. ఐటీ అధికారులు ఇలా వచ్చి తనిఖీలు చేయరని.. నోటీసులు ఇస్తారని చెప్పడంతో అనుమానం వచ్చిన దుకాణ యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఐటీ అధికారులతో మాట్లాడి.. బంగారం స్వాధీనం చేసుకున్న వ్యక్తులు నకిలీ ఐటీ అధికారులుగా తేల్చారు. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు.
ఇవీ చదవండి :