SC on Ukraine Evacuation: ఉక్రెయిన్- రష్యా యుద్ధానికి సంబంధించిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. యుద్ధభూమిలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి తిరిగి రప్పించడంపై కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలంటూ ఓ న్యాయవాది ఈ వ్యాజ్యం వేశారు.
ఉదయం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే.. ఈ పిటిషన్‌ను ప్రస్తావించారు న్యాయవాది. స్పందించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ.. "ఈ విషయంలో కోర్టు ఏం చేయగలదు? యుద్ధం ఆపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను నేను ఆదేశించగలనా? సోషల్ మీడియాలోనూ నేను కొన్ని పోస్టులు చూశాను. సీజేఐ ఏం చేస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు" అని అన్నారు.
ఈ దశలో జోక్యం చేసుకున్న పిటిషనర్.. విద్యార్థుల తరలింపుపై కేంద్రానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం పోలాండ్, హంగేరీ నుంచి మాత్రమే విమానాలు నడుస్తున్నాయని.. రొమేనియా నుంచి ఎలాంటి సదుపాయాలు లేవని వివరించారు. అక్కడ చిక్కుకున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది బాలికలని.. వారంతా తీవ్రమైన చలిలో ఇబ్బంది పడుతున్నారని వివరించారు.
"వారి పట్ల మాకు జాలి ఉంది. కానీ కోర్టు ఏం చేయగలదు? విద్యార్థుల కోసం ప్రభుత్వం ఇప్పటికే చేయగలిగింది చేస్తోంది. ఆ విద్యార్థులకు సాయం చేయాలని అటార్నీ జనరల్‌ను కోరతాం. ఈ పిటిషన్‌ను విచారణకు చేపడతాం. విచారణ మొదలయ్యే వరకు వేచి ఉండండి" అని ఆ న్యాయవాదికి సూచించారు జస్టిస్ రమణ.
ఇదీ చూడండి : పిల్లులు, కుక్కలతో సేఫ్‌గా భారత్‌కు.. మూగజీవాల్ని యుద్ధభూమిలో వదిలేయలేక..