నోయిడాలోని 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేత విషయంలో.. వాటి నిర్మాణ సంస్థ సూపర్‌టెక్ లిమిటెడ్‌కు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. రెండు టవర్లలో ఒకదాన్ని మాత్రమే కూల్చివేసేలా.. తీర్పును సవరించాలని అభ్యర్థిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇంతకుముందు ఇచ్చిన తీర్పులో మార్పులు చేయడం కుదరదని తేల్చి చెప్పింది.
టవర్స్ కూల్చివేత ఎందుకు?
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని నోయిడాలో సూపర్‌టెక్ లిమిటెడ్ కంపెనీ భారీ ప్రాజెక్టు కింద నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేయాల్సిందిగా ఆగస్టు 31న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలను అతిక్రమించి కట్టిన ఈ భవనాలను నిపుణుల పర్యవేక్షణలో మూడు నెలల్లోపు సొంత ఖర్చులతో సూపర్‌టెక్ కంపెనీయే కూల్చాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేగాక, ఈ టవర్స్‌లో ఫ్లాట్లు కొనుక్కున్న వారికి బుక్ చేసుకున్న సమయం నుంచి 12 శాతం వడ్డీతో ఆ సొమ్ము తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
ఈ తీర్పు తర్వాత.. సూపర్‌టెక్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్విన్ టవర్లలో ఒక్కదాన్నే కూల్చేస్తామని, రెండోదాన్ని అలాగే ఉంచుతామని, అందుకు అనుమతి ఇవ్వాలని కోరింది.
ఈ టవర్లలో మొత్తం 915 ఫ్లాట్లు, 21 దుకాణాలు ఉన్నాయి. ఈ భవనాల నిర్మాణ సమయంలో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు ప్రణాళికను చూపాలన్న నిబంధనను బిల్డరు పెడచెవిన పెట్టారు. రెండు టవర్స్ మధ్య కనీస దూరం పాటించడం లేదని చీఫ్ ఫైర్ ఆఫీసర్ లేఖ రాసినా నోయిడా అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఈ టవర్స్ నిర్మాణంపై రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏళ్ల పాటు న్యాయపోరాటం చేయగా.. భవనాలను కూల్చివేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది.
నెలాఖరులోగా పరిహారం చెల్లించాలి..
దిల్లీ హైకోర్టులో కూడా సూపర్‌టెక్ సంస్థకు షాక్ తగిలింది. కూల్చివేతకు ఆదేశించిన టవర్స్‌లో విల్లా కొన్న వారికి రూ.40 లక్షలు అక్టోబర్ చివరినాటికి చెల్లించాలని ఆదేశించింది దిల్లీ హైకోర్టు. మిగతా రూ.17 లక్షలను చెల్లించేందుకు నవంబర్ చివరి వరకు గడువు ఇచ్చింది.
నిజానికి విల్లా కొనుగోలుదారులకు రూ.1.79 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే సెప్టెంబర్ 24న కోర్టు అదేశాల మేరకు రూ.50 లక్షలు చెల్లించింది సంస్థ. మిగత మొత్తానికి సంబంధించి తాజాగా గడువు విధించి న్యాయస్థానం.
అయితే సూపర్‌టెక్ తరఫు న్యాయవాది మాత్రం.. కంపెనీ నెలకు రూ.10 లక్షల చొప్పున చెల్లించేందుకు సిద్ధంగా ఉందని కోర్టుకు విన్నవించారు. అయితే కోర్టు మాత్రం ఈఎంఐ భారీ మొత్తంగా ఉండాలని సూచించింది.
ఇవీ చదవండి: