ఏదైనా వ్యాధితో డాక్టర్ వద్దకు వెళితే ఆయన రాసే మందుల చీటీ.. దుకాణాదారుడికి తప్ప మరొకరికి అర్థం కాదు. ఇలాంటి బాధలకు చెక్ పెడుతూ.. రోగి సైతం మందుల చీటిని అర్థం చేసుకునేలా హిందీలో ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారు ఓ వైద్యుడు. మధ్యప్రదేశ్ సత్నాకు చెందిన డాక్టర్ సర్వేశ్ సింగ్ ఈ విధానాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని ఇతర వైద్యులు కూడా హిందీలోనే మందుల చీటీని రాయాలని ఆయన ఆకాంక్షించారు. హిందీలో MBBS చేసేందుకు వీలుగా పుస్తకాలను విడుదల చేసిన నేపథ్యంలో.. మందుల చీటీని సైతం హిందీలోనే రాయాలని ఇటీవలే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. మందులు రాసే ముందు 'శ్రీ హరి' అన్న పదాన్ని ఉపయోగించాలని కోరారు.
ఈ క్రమంలోనే.. సత్నాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే సర్వేశ్ సింగ్ దీనికి నాంది పలికారు. లౌలాచ్కు చెందిన రోగి రష్మీ సింగ్ కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లగా.. చికిత్స అందించిన వైద్యుడు.. హిందీలో చీటీ రాసి ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్గా మారాయి. మందుల చీటిలో ప్రిస్క్రిప్షన్ అని అర్థంవచ్చే 'ఆర్ఎక్స్'కు బదులుగా 'శ్రీ హరి' అని రాస్తున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన ప్రసంగం విని తాను ప్రేరణ పొందానని డాక్టర్ సర్వేశ్ తెలిపారు. వ్యాధి వివరాలను సైతం హిందీలో రాయడానికి ప్రయత్నిసామన్నారు. మందుల చీటీ హిందీలో ఉండడం వల్ల.. తమకు అర్థం అవుతోందని రోగులు చెబుతున్నారు.
హిందీలో వైద్య విద్యను బోధించేందుకు వీలుగా ఆదివారం పుస్తకాలను ప్రచురించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. కేంద్ర మంత్రి అమిత్ షా వాటిని భోపాల్‌లో విడుదల చేశారు. MBBSలో మూడు సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలను విడుదల చేశారు. చరిత్రలో ఇది చాలా ముఖ్యమైన రోజుగా అభివర్ణించారు అమిత్ షా. వైద్య విద్యను హిందీలో బోధిస్తున్న తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచిందని కొనియాడారు.
ఇవీ చదవండి: హిందీ MBBS బుక్స్ విడుదల.. త్వరలోనే తెలుగులో ఇంజినీరింగ్ కోర్సులు!
మంత్రికి చికిత్స చేస్తుండగా ఆస్పత్రిలో కరెంట్ కట్.. తర్వాత ఏమైందంటే?