రైతులకు ఇచ్చిన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆరోపించింది. ఇందుకు నిరసనగా దేశవ్యాప్తంగా ర్యాలీలు చేపడతున్నట్లు గురువారం ప్రకటించింది. నవంబర్ 26న దేశంలో ఉన్న అన్ని రాజ్‌భవన్‌లకు ర్యాలీలు నిర్వహించనున్నట్లు ఎస్కేఎం గురువారం వెల్లడించింది. రైతుల డిమాండ్‌లను నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని రైతు సంఘం ఆరోపించింది.
డిసెంబర్ 1 నుంచి 11 వరకు దేశంలోని అన్ని పార్టీల లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల కార్యాలయాలకు ర్యాలీగా వెళ్లనున్నట్లు ఎస్కేఎం నేత దర్శన్ పాల్ తెలిపారు. వ్యవసాయ చట్టాల రద్దుకై పోరాడిన రైతు సంఘాలన్నీ కలిసి డిసెంబర్ 8న కర్నాల్‌లో.. తరవాత దశ ఉద్యమం కొరకు సమావేశం కానున్నట్లు తెలిపారు. గత సంవత్సరం దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన రోజైన నవంబర్ 19వ తేదీన 'ఫతే దివస్' లేదా 'విజయ్ దివస్'గా రైతులు జరుపుకుంటారని సంయుక్త కిసాన్ మోర్చా వెల్లడించింది.
వ్యవసాయ చట్టాల రద్దు తరువాత డిసెంబర్ 9న నిరసనలు ముగించినప్పుడు రైతులకు లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను కేంద్రం పూర్తిగా విస్మరించిందని ఎస్కేఎం ఆరోపించింది. కనీస మద్దతు ధరపై కమిటీ వేయలేదని, ఆందోళన సందర్భంగా రైతులపై పెట్టిన 'తప్పుడు కేసుల'ను ఉపసంహరించుకోలేదని రైతు సంఘం పేర్కొంది. కనీస మద్దతు ధర అనేది చట్టపరమైన హామీ అని రైతు సంఘం తెలిపింది. రైతుల డిమాండ్‌లను పరిగణనలోకి తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆరోపించింది.