యవ్వనంలో ప్రతి ఒక్కరికీ కలిగే ఫీలింగ్ ప్రేమ.. దీన్ని ఎవరూ ఆపలేరు. అమ్మాయి.. అబ్బాయి ప్రేమలో పడడం సహజం. అయితే ఈ మధ్య కాలంలో యువత జెండర్‌తో సంబంధం లేకుండా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అర్థం చేసుకునే మనసుంటే చాలు.. ఏ లింగభేదం లేదని బహిర్గతంగా వెల్లడిస్తున్నారు. ఇలాంటి ఘటనే బంగాల్లో జరిగింది. దాదాపు రెండేళ్లుగా ఇద్దరమ్మాయిలు ప్రేమించుకుని.. ఇంటి నుంచి పరారైయ్యారు. ఇందులో విశేషం ఏంటంటే.. వీరిద్దరిలో ఒక అమ్మాయికి నెల రోజుల క్రితమే వివాహం జరిగింది. అయినా సరే తన భర్తను వదిలి.. ప్రేయసితో పారిపోయింది.
ఆలిపుర్ద్వార్ జిల్లాలోని ఫలకాటా ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి, కూచ్‌బిహార్ జిల్లాలోని తుఫాన్‌గంజ్ ప్రాంతానికి చెందిన ఇంకో అమ్మాయి.. ఒకే కాలేజీలో చదువుతున్నారు. రెండేళ్ల క్రితం ఫుట్‌బాల్ ఆడుతుండగా.. ఈ ఇద్దరమ్మాయిల మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త స్నేహంగా మారింది. దీంతో వారిద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం పెరిగి.. స్నేహం కాస్త ప్రేమగా మారింది. వారిద్దరూ అమ్మాయిలు అయినా సరే లింగభేదం లేకుండా ప్రేమించుకున్నారు. అయితే ఆ ప్రేమ వ్యవహారం వారి ఇంట్లో తెలిసింది. దీంతో తుఫాన్‌గంజ్‌కు చెందిన అమ్మాయి తల్లిదండ్రులు నెల రోజుల క్రితం హాడావుడిగా తమ కుమార్తెకు ఓ యువకుడితో వివాహం జరిపించారు. వారు పెళ్లి అయితే చేయగలిగారు కాని.. ఆమె మనసులో తన ప్రేయసిపై ఉన్న ప్రేమను తొలగించలేకపోయారు. దీంతో పెళ్లైన నెలరోజుల తర్వాత గత బుధవారం ఆ అమ్మాయి తన భర్తను వదిలి.. తాను ప్రేమించిన అమ్మాయి వద్దకు చేరుకుంది. అనంతరం వారిద్దరూ మల్దా ప్రాంతంలోని ఓ హోటల్లో రూమ్‌ను అద్దెకు తీసుకుని ఉన్నారు. అయితే వారి ప్రవర్తనను గమనించిన హోటల్ సిబ్బంది.. వీరిని ప్రశ్నించగా అసలు విషయం బయట పడింది. సిబ్బంది వెంటనే ఆ ఇద్దరమ్మాయిలను పోలీసుల వద్దకు తీసుకువెళ్లారు. విషయం తెలుకున్న పోలీసులు ఇరువురి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
"మేము ఇద్దరం ఆడపిల్లలమైనప్పటికీ.. మాకు స్వలింగ సంపర్కం ఉంది. రెండేళ్లుగా ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. మేము కలిసి ఉండాలనుకుంటున్నాము. నాకు తెలుసు మా సంబంధాన్ని మా కుటుంబసభ్యులతో సహా సమాజం కూడా అంగీకరించదని.. కానీ మేము ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేము. అంతేకాకుండా, మేము ఇద్దరం మేజర్స్.. స్వలింగ సంపర్కం కూడా మన దేశంలో చట్టబద్ధం. అందుకే మేమిద్దరం ఇంటి నుంచి పారిపోయాము. తల్లిదండ్రులు మా సంబంధాన్ని అంగీకరిస్తే.. తిరిగి ఇంటికి వెళ్తాము. లేకపోతే మేము వెళ్ళము. అలా అయితే.. మేము న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తాము" అని ఫలకాటాకు చెందిన యువతి చెప్పింది.
తమని ఎవరూ బలవంతంగా తీసుకురాలేదని.. తామే ఇంటి నుంచి పారిపోయి వచ్చినట్లు తూఫాన్గంజ్కు చెందిన అమ్మాయి వెల్లడించింది. తనకు నెల రోజుల క్రితం పెళ్లైందని.. తన భర్త అంటే తనకు ఇష్టం లేదని ఆమె చెప్పింది. దీంతో తన ప్రియరాలితో భార్యాభర్తల మాదిరిగానే జీవితాన్ని గడపాలనుకుంటున్నట్లు ఆ యువతి తెలిపింది. తమ ప్రేమకు ఇరు కుటుంబాలు ఒప్పుకోకుంటే.. ఇంటికి తిరిగి వెళ్లేదే లేదని తేల్చి చెప్పింది. అయితే ఇరు కుటుంబాలు తమ కుమార్తెలు కనిపించడంలో స్థానికంగా ఉన్న పోలీస్స్టేషన్ల్లో కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం ఇద్దరు యువతులు మల్దా పోలీస్‌స్టేషన్‌లో ఉన్నారని.. వారి కుటుంబసభ్యులు రాగానే వారికి అప్పగిస్తామని అక్కడ పోలీసులు తెలిపారు.