Sai Baba Meditation Tree : మహారాష్ట్రలోనే కాదు.. దేశంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో శిరిడి సాయిబాబా మందిరం ఒకటి. సాయి భక్తులు జీవితంలో ఒక్క సారైనా ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలని కోరుకుంటారు. సాయిబాబాను హిందువులతో పాటు ముస్లింలు అపారమైన భక్తితో కొలుస్తారు. అయితే, సాయి చరిత్ర భక్తులకు తెలిసినా.. బాబా జీవన శైలిలో భాగమైన ధ్యానం గురించి మాత్రం చాలా మందికి తెలియదు. 20వ శతాబ్దం ప్రారంభంలో బాబా.. అహ్మద్‌నగర్ జిల్లాలోని రహతా ప్రాంతంలోని ఓ చెట్టు కింద ధ్యానం చేసేవారని భక్తుల నమ్ముతారు. ఈ చెట్టు వద్ద కోరుకుంటే కోరికలన్నీ నెరవేరుతాయని భావిస్తారు. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చెట్టును కల్పవృక్షం, చింతామణిగాను పిలుస్తుంటారు.
ఎప్పుడు వచ్చినా వారింట్లోనే
సాయిబాబా రహతాకు ఎప్పుడు వచ్చినా.. శాండ్ కుటుంబానికి చెందిన ఇంట్లోనే నివాసం ఉండేవారు. దాదాపు 160 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ ఇంటిని ఆయన గుర్తుగా ఇప్పటికీ అలానే ఉంచారు. వారసత్వాన్ని కొనసాగిస్తూ తరతరాలుగా సాయిబాబా సేవలోనే గడుపుతున్నారు.
''ఈ కల్పవృక్షం.. భక్తులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తోంది. ఇక్కడికి వచ్చి కోరిన వారి కోరికలు నెరవేరుతాయి. ఇది నాకు జరిగింది. బాబా ఎప్పుడూ శిరిడి నుంచి నేరుగా మా ఇంటికి వచ్చేవారు కాదు. దారిలోని పొలం దగ్గర ఆగేవారు. సేవకుడు లక్ష్మణ్ వచ్చి.. బాబా వచ్చాడని గ్రామస్థులకు తెలియజేసేవారు. వెంటనే గ్రామస్థులంతా వెళ్లి మంగళవాయిద్యాలతో బాబాను ఊరేగింపుగా ఇంటికి తీసుకువచ్చేవారు''
--సురేంద్ర జైచంద్ శాండ్, సాయి ఆశ్రయం పొందిన ఇంటి కుటుంబ సభ్యుడు
ఆ మంగళవాయిద్యాల బృందంలోని సభ్యుడి మనవడు.. ఇప్పటికీ సాయిబాబా సేవ చేస్తూ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.
"మా తాత సాయిబాబాకు సేవ చేసేవారు. సాయిబాబాకు మా తాత అంటే చాలా అభిమానం. మా తాతయ్య తన జీవితమంతా సాయిబాబా సేవకే అంకితం చేశారు. నేను కూడా మా తాతలానే బాబాను పూజిస్తాను. మా బ్యాండ్ బృందంతో శిరిడిలోని సాయి మందిరంలో ప్రదర్శనలు ఇస్తుంటాము".
--బాలాంభాయ్ పాపాభాయ్ సయ్యద్, సాయి ఊరేగింపునకు బ్యాండ్ కొట్టిన వ్యక్తి మనవడు
శిరిడిని సందర్శించిన భక్తులు.. అనేక మంది ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తున్నారు.
"సాయిబాబా జీవించి ఉన్నప్పుడే ఇక్కడికి వస్తే బాగుండేది అనిపించింది. కానీ అది కుదరదు కదా! రహతాలోని ఈ చెట్టు గురించి విని చూడటానికి వచ్చాం. ఇక్కడ బాబా సన్నిధిని చూసి ఉద్వేగానికి లోనయ్యాను."
-- శ్యామల, భక్తురాలు (హైదరాబాద్)
"ఇది 200 సంవత్సరాల నాటి చెట్టు అని నేను విన్నాను. సాయిబాబా ఇక్కడికి వచ్చి ఈ చెట్టు కింద ధ్యానం చేశారని విని.. దీనిని చూడటానికి వచ్చాను"
--అరుణ, భక్తురాలు (గుంటూరు)
"ఈ కల్పవృక్షం వద్ద కోరుకున్న కోరికలు అన్ని నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. నా కుటుంబంతో సహా చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ చెట్టులోనే బాబా కొలువై ఉంటాడని నమ్ముతారు"
-- కనిప్రత్ గుంజలే, స్థానికుడు
ISO Certificate to Shirdi Saibaba Sansthan: పరిశుభ్రతలో శిరిడీ సాయిబాబా సంస్థాన్‌కు ఐఎస్ఓ గుర్తింపు