Sachin Pilot VS Ashok Gehlot : రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ నేత సచిన్ పైలట్ కీలక ప్రకటన చేశారు. అశోక్ గహ్లోత్‌తో సాగుతున్న వివాదానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సలహా మేరకు నడచుకుంటున్నానని.. అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు సమష్టి నాయకత్వమే ఏకైక మార్గమని పేర్కొన్నారు.
రాష్ట్ర ఎన్నికల సన్నద్ధతపై కాంగ్రెస్ అధినాయకత్వం సమావేశం నిర్వహించిన రెండు రోజుల్లోనే పైలట్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. త్వరలో అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఈ వ్యవహారం అధిష్ఠానానికీ తలనొప్పిగా మారింది. ఈ తరుణంలోనే సచిన్ పైలట్ ఈ ప్రకటన చేయడం కీలక పరిణామం. అయితే, పార్టీలో పూర్తి ఐక్యత ఉంటేనే.. ఎన్నికల్లో విజయం సాధించగలమని కాంగ్రెస్ ఇటీవల స్పష్టం చేసిన నేపథ్యంలో పైలట్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Sachin Pilot Comments On Ashok Gehlot : 'గతంలో జరిగిన వాటిని క్షమించి మరిచిపోయి.. ముందుకెళ్లాలని అని మల్లికార్జున ఖర్గే ఇటీవల సలహా ఇచ్చారు. ఇది అందరికీ వర్తిస్తుంది. ఈ విషయాన్ని మీరు నమ్ముతున్నా' అని సచిన్ పైలట్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. 'గహ్లోత్ నాకంటే పెద్దవారు. ఆయనకు అనుభవం ఎక్కువ. ఆయనపై పెద్ద బాధ్యతలు ఉన్నాయి. నేను రాజస్థాన్ పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు అందరినీ కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నించాను. ఇప్పుడు గహ్లోత్ కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న చిన్న విభేదాలు పెద్ద సమస్య కాదు. ఎందుకంటే వ్యక్తి కంటే పార్టీ, ప్రజలే ముఖ్యం. మేము ఇద్దరం ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడమే మా తదుపరి లక్ష్యం. వ్యక్తులు, వారు చేసిన వ్యాఖ్యలు ముఖ్యం కాదు. ఇది ముగిసిన అధ్యాయం' అని పైలట్ వివరించారు.
'వారి నిర్ణయానికే కట్టుబడి ఉంటా'
'ఇప్పుడు మేమందరం కలిసి ముందుకు సాగాలి. కొత్త సవాళ్లను ఎదుర్కోవాలి. ఈ దేశానికి కాంగ్రెస్ అవసరం చాలా ఉంది. రాష్ట్ర ప్రజల ఆశీస్సులు కావాలి. దీన్ని పొందాలంటే పార్టీ శ్రేణులతో పాటు ప్రజలకు ఆమోదయోగ్యమైన రీతిలో ఐక్యతతో ముందుకు సాగాలి' అని పైలట్ అన్నారు. పార్టీలో ఎలాంటి పాత్ర పోషిస్తారని ప్రశ్నించగా.. గతంలో తనకు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తించానని, పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అదే తనకు శిరోధార్యమని చెప్పారు. అయితే, రాజస్థాన్‌తో తనకు ఎనలేని అనుబంధం ఉందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో రాజస్థాన్‌లో అధికార పార్టీని ఓడించే సంప్రదాయాన్ని తిప్పికొట్టి ఎక్కువ సీట్లతో గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
కాగా, 2018లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గహ్లోత్, పైలట్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. 2020లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సచిన్ పైలట్, మరో 18 మంది ఎమ్మెల్యేలు సీఎం గహ్లోత్‌పై తిరుగుబాటు చేశారు. దాదాపు నెల రోజుల పాటు ఈ రాజకీయ ప్రతిష్టంభన కొనసాగింది. ఎట్టకేలకు పార్టీ అధిష్ఠానంతో చర్చించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించారు పైలట్. గతేడాది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా రాజకీయ అనిశ్చితి నెలకొంది. మరోవైపు, గహ్లోత్‌పై విమర్శలు చేస్తూనే .. తన సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్రకు దిగారు. గత బీజేపీ ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ పరిణామాలు పార్టీని కలవరపరిచినా.. తాజా నిర్ణయంతో కాస్త ఊరట లభించినట్లయ్యింది