royal enfield bikes stealing: సినిమాలు చూసి ప్రభావితమై విలాసవంతమైన జీవితం గడిపేందుకు అడ్డదారిని ఎంచుకున్నారు ఏడుగురు యువకులు. నగరంలో ఖరీదైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను దొంగిలించడమే వృత్తిగా మార్చుకున్నారు. అలా వరుస దొంగతనాలు చేస్తూ మంగళవారం కర్ణాటకలోని బనశంకరి పోలీసులకు పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.68 లక్షలు విలువైన 30 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారిగా గుర్తించారు. వీరంతా ఎంబీఏ, ఇంజినీరింగ్ లాంటి ఉన్నత చదువులు చదువుకున్నవారని వెల్లడించారు.
నిందితులు విజయ్, హేమంత్, గుణశేఖర్ రెడ్డి, భానుమూర్తి, పురుషోత్తం, కార్తీక్, కిరణ్.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందినవారు. వీరి వయసు 26 నుంచి 28 ఏళ్ల మధ్య ఉంటుంది. లాక్‌డౌన్ సమయంలో నిందితులు కోరుకున్న ఉద్యోగం రాలేదు. అందువల్ల తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయారు. అలాగే నిందితులు సినిమా ప్రేమికులు.. తక్కువ సమయంలో ధనవంతులు కావాలని ఆశ పడే వ్యక్తులు. వీరి విలాసాల కోసం బైక్‌లను దొంగిలించాలని ప్లాన్ చేశారు. బైక్ దొంగిలించే ఆలోచనలను తెలుసుకోవడానికి యూట్యూబ్‌ని చూసేవారు. బహిరంగ ప్రదేశాల్లో బుల్లెట్ బైక్‌లను లక్ష్యంగా చేసుకుని.. వాటిని దొంగిలించి తక్కువ ధరకు ఆంధ్రప్రదేశ్‌లో అమ్మేవారు. అలా వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు. ఇటీవల బనశంకరి పోలీస్ స్టేషన్‌లో బైక్ దొంగతనం కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన పోలీసు బృందం.. ఈ ఏడుగురు నిందితులను అరెస్టు చేసింది. రాష్ట్రంలో వివిధ ప్రదేశాలలో నిందితులపై 27 కేసులు నమోదయ్యాయి. నిందితులు ముఠాగా మారి గత మూడేళ్లుగా బైక్‌లను దొంగిలిస్తున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
కార్లు ధ్వంసం.. బెంగళూరులో జరిగిన మరో ఘటనలో ఓ వ్యక్తి కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అలాగే పెద్ద పెద్ద రాళ్లతో కార్ల అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ దృశ్యాలు మైసూరులోని రాఘవేంద్ర నగరంలో సీసీటీవీ రికార్డుల్లో నమోదయ్యాయి. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఈ దాడికి పాల్పడ్డాడు దుండగుడు. ఈ ఘటనపై వాహనాల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: చండీగఢ్‌పై హరియాణా అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం