దిల్లీలోని రోహిణి కోర్టులో(delhi rohini court news) జరిగిన కాల్పుల ఘటనతో(Rohini court firing) దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా న్యాయస్థానాల్లో భద్రతను సమీక్షించాలంటూ సుప్రీంకోర్టులో(Supreme court) పిటిషన్ దాఖలైంది. దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా న్యాయాధికారులు, న్యాయమూర్తులకు జడ్ ప్లస్ భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు న్యాయవాది విశాల్ తివారి పిటిషన్ వేశారు.
అన్ని కోర్టుల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసి భద్రతపై రాజీపడకుండా చర్యలు చేపట్టే విధంగా రాష్ట్రాలకు ఆదేశాలివ్వాలని పిటిషనర్ కోరారు. రోహిణి కోర్టు ఘటన ఒకరకంగా న్యాయాధికారులను బెదిరించడమేనన్న పిటిషనర్.. ఇది మొత్తం న్యాయవ్యవస్థకు ముప్పు అని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రమాదకర నేరస్థులు, ఉగ్రవాదులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే విచారణ జరిపే విధంగా.. ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
మరో పిల్..
దిల్లీలోని దిగువ స్థాయి న్యాయస్థానాల్లో సరిపడా భద్రత ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దిల్లీ రోహిణి కోర్టు కాల్పుల ఘటన నేపథ్యంలో భద్రత ఏర్పాటు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు న్యాయవాది దీపక్ జోసెఫ్. రోహిణి ఘటన తర్వాత కోర్టుల్లోని న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది, పిటిషనర్ల భద్రత, రక్షణపై పలు ప్రశ్నలు తలెత్తున్నాయన్నారు.
భద్రత కట్టుదిట్టం..
గ్యాంగ్స్టర్ జితేంద్ర అలియాస్ గోగీని ఇద్దరు దుండగులు.. కోర్టు ఆవరణలోనే కాల్చి (Rohini court firing) చంపిన క్రమంలో దిల్లీ రోహిణి కోర్టు వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా బలగాలను మోహరించారు.
ఇదీ చూడండి: పట్టపగలే కోర్టులో కాల్పులు.. ముగ్గురు మృతి