Rohini Court Blast: దిల్లీలోని రోహిణి కోర్టులో డిసెంబర్ 9న జరిగిన బాంబు పేలుడు కేసులో పురోగతి సాధించారు ప్రత్యేక విభాగం పోలీసులు. కోర్టు ఆవరణలో బాంబు పెట్టిన ఆరోపణలతో అశోక్ విహార్ ప్రాంతానికి చెందిన ఓ శాస్త్రవేత్తను అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు సహాయం చేసిన మరో నలుగురిని సైతం అరెస్ట్ చేశారు.
కోర్టు విచారణకు హాజరైన తన పొరుగింటి వ్యక్తిని హత్య చేసే ఉద్దేశంతోనే బాంబు పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో పూర్తి వివరాలను రాబట్టేందుకు విచారణ కొనసాగుతోందని చెప్పారు.
ఇదీ జరిగింది..
డిసెంబర్ 9న రోహిణి కోర్టులో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో కోర్టు నయిబ్ గాయపడ్డారు. బాధితుడికి స్థానిక అంబేద్కర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ల్యాప్టాప్ బ్యాటరీ పేలి ఉంటుందని ప్రాథమికంగా భావించారు పోలీసులు. అయితే, కోర్టులో ఉద్దేశపూర్వకంగానే టిఫిన్ బాక్స్ బాంబును పెట్టినట్లు తేల్చారు. దానిని రిమోట్ కంట్రోలర్ ద్వారా ఆపరేట్ చేసినట్లు వెల్లడించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తును ప్రత్యేక విభాగానికి అప్పగించారు. 100కుపైగా సీసీటీవీలను క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం నిందితుడిని పట్టుకున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఆ రోజు కోర్టు ఆవరణలోని అనుమానిత ప్రాంతాల్లో నిందితుడి చిత్రాలు కనిపించినట్లు చెప్పారు. అతని సమీపంలో ఉన్నవారిలో ఒకరిని పొరుగింటి వ్యక్తిగా గుర్తించారు.
ఇదీ చూడండి:
Rohini Court Blast: దిల్లీ రోహిణీ కోర్టులో పేలుడు.. ఒకరికి గాయాలు