గుజరాత్‌పై తన పట్టును భాజపా మరోసారి నిరూపించుకుంది. నగరపాలక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 576 స్థానాలకు గాను ఏకంగా 483 చోట్ల విజయ దుందుభి మోగించింది. కాంగ్రెస్ కేవలం 55 స్థానాలకే పరిమితమైంది. సూరత్‌లో ఖాతా కూడా తెరవలేకపోయింది.
అహ్మదాబాద్, రాజ్‌కోట్, జామ్‌నగర్, భావ్‌నగర్, వడోదరా, సూరత్ నగరపాలక సంస్థల ఎన్నికలు ఈ నెల 21న జరిగాయి. ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. కమల దళానికి అహ్మదాబాద్‌లో మొత్తం 192 స్థానాలకుగాను 159, రాజ్‌కోట్‌లో 72 సీట్లకుగాను 68, జామ్‌నగర్‌లో 64 స్థానాలకు గాను 50, భావ్‌నగర్‌లో 52 సీట్లకు గాను 44, వడోదరాలో 76 స్థానాలకుగాను 69, సూరత్‌లో 120 స్థానాలకుగాను 93 దక్కాయి.
ఆప్ శెభాష్!
తొలిసారి ఈ ఎన్నికల బరిలో నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంచి ఫలితాలు రాబట్టింది. 27 సీట్లను గెలుచుకుంది. అవన్నీ సూరత్లోనివే. తద్వారా సూరత్‌లో ఆప్ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. తొలిసారిగా గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచిన ఏఐఎంఐఎం అహ్మదాబాద్‌లో ఏడు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది.
ప్రధాని, షా హర్షం..
గుజరాత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపా జయభేరీ మోగించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. సుపరిపాలన, అభివృద్ధి రాజకీయాలపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని తాజా ఫలితాలు చాటిచెప్తున్నాయని వ్యాఖ్యానించారు. విజయంపై సీఎం విజయ్ రూపానీని అమిత్ షా అభినందించారు.