Resident Doctors Strike: నీట్ పీజీ 2021 కౌన్సిలింగ్ ఆలస్యం కావడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా రెసిడెంట్ వైద్యులు ఆందోళనలకు దిగారు. ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఎఫ్ఓఆర్డీఏ) ఇచ్చిన దేశవ్యాప్త నిరసనలకు సంఘీభావంగా వైద్యులు తమ విధులు బహిష్కరించి ఆందోళనల్లో పాల్గొన్నారు.
దిల్లీలోని సఫ్ధర్‌జంగ్ ఆస్పత్రి ముందు రెసిడెంట్ వైద్యులు కౌన్సిలింగ్ త్వరగా చేపట్టాలని నినాదాలు చేశారు. మరోవైపు.. దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఆందోళనల్లో లేడీ హార్డింగే మెడికల్ కళాశాల వైద్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నీట్ పీజీ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
అటు.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వైద్యులు నిరసనలు చేపట్టారు. అసోంలోని దిబ్రూగఢ్‌లో అసోం మెడికల్ కళాశాల జూనియర్ వైద్యులు ఆందోళనల్లో పాల్గొన్నారు. దిల్లీలోని లేడీ శ్రీరామ్ కళాశాల వైద్యులు.. ఆందోళనలు చేపట్టారు.
ఎందుకు ఆలస్యం..?
ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి నీట్ పీజీ ఆల్‌ఇండియా కోటాలో ఓబీసీలకు 27శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ ఏడాది జులై 29న మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నోటిషికేషన్ జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొంతమంది నీట్ అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వీటిని విచారించిన ధర్మాసనం.. రిజర్వేషన్ల చెల్లుబాటుపై కోర్టు నిర్ణయం తీసుకునే వరకు కౌన్సిలింగ్ ప్రక్రియను నిలిపివేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. కోర్టు తీర్పు వచ్చే వరకు కౌన్సిలింగ్ చేపట్టబోమని కేంద్రం కూడా హామీ ఇచ్చింది.
ఇదీ చూడండి: నీట్ పీజీ కౌన్సిలింగ్‌కు బ్రేక్.. సుప్రీం నిర్ణయం తర్వాతే!