ప్రఖ్యాత చిత్రకారుడు పద్మభూషణ్ లక్ష్మణ్ పాయ్(95) ఇక లేరు. గోవాలోని ఆయన నివాసంలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. గోవా ఆర్ట్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ అయిన లక్ష్మణ్ పాయ్ .. ఎన్నో విశిష్ట పురస్కారాలు సాధించారు. పద్మ భూషణ్, పద్మశ్రీ, నెహ్రూ అవార్డ్, లలిత్ కళా అకాడమీ అవార్డు వంటి పురస్కారాలు ఆయన అందుకున్నారు.
ప్రముఖుల సంతాపం..
లక్ష్మణ్ పాయ్ మృతి పట్ల గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గోవా ఓ దిగ్గజ రత్నాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు. కళారంగానికి ఆయన చేసిన సేవలను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటామని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
గోవా అసెంబ్లీ ప్రతిపక్ష నేత దిగంబర్ కామత్.. లక్ష్మణ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రతిష్ఠాత్మక విద్యాధిరాజ్ పురస్కారాన్ని లక్ష్మణ్‌ను వరించినప్పటికీ.. కొవిడ్ వల్ల ఆయనకు ప్రదానం చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి శ్రీపాద్ వై. నాయక్.. లక్ష్మణ్ మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి:ఒకే కుటుంబంలో 14 మందికి కరోనా