బంగాల్లో అధికార టీఎంసీకే ప్రజలు పట్టంగట్టారు. సీఎం మమతా బెనర్జీ పార్టీని వరుసగా మూడోసారి గెలిపించారు. ఈ ఎన్నికలు బంగాల్ ఆత్మగౌరవానికి, బయటి వ్యక్తులకు మధ్యే అని చెప్పిన దీదీనే ఆదరించారు. 200 స్థానాలకు పైగా గెలుస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భాజపాను రెండంకెల సీట్లకే పరిమితం చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన ఈ ఎన్నికల్లో ప్రజలు టీఎంసీనే ఆదరించారు.
బంగాల్ ఎన్నికలు గతానికి భిన్నంగా ఈసారి 8 విడతల్లో జరిగాయి. మోదీ, అమిత్ షా సహా భాజపా కేంద్రమంత్రులు, అగ్రనేతలు పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించారు. ప్రతి జిల్లాలో పర్యటించారు. టీఎంసీకి వ్యతిరేకంగా పదునైన విమర్శలు చేశారు. అయినా బంగాల్ పీఠాన్ని అధిరోహించాలనే కమళనాథుల కల ఈసారి కూడా నెరవేరలేదు. మమతా బెనర్జీ చరిష్మా ముందు ఆ పార్టీ పరాభవం తప్పలేదు.
ఉద్రిక్తతలు..
8 విడతల పోలింగ్లో ఎన్నో హింసాత్మక ఘటనలు జరిగాయి. తృణమూల్, భాజపా కార్యకర్తల పలు మార్లు ఘర్షణలకు పాల్పడ్డారు. నాలుగో విడత పోలింగ్ సందర్భంగా సీతల్కూచి పోలింగ్బూత్ వద్ద సీఆర్పీఎఫ్ బలగాలు ఓటర్లపై కాల్పులు జరిపిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ఆ తర్వాత భాజపా నాయకులు చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. భాజపా ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తుందనేందుకు ఈ ఘటనే నిదర్శనమని టీఎంసీ నేతలు ధ్వజమెత్తారు. ఈ ఘటన కూడా ఎన్నికలను ప్రభావితం చేసింది.
దీదీకి ఎదురులేదు..
ఎన్నికలకు ముందు ఓవైపు దూసుకొస్తున్న భాజపా సునామీ.. మరోవైపు సొంత పార్టీని వరుసపెట్టి వీడుతున్న నేతలు... నిరుద్యోగంపై ప్రజల్లో ఆందోళన.. ఇన్ని సమస్యల మధ్య ఎన్నికలకు వెళ్లింది దీదీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్. ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఉన్న అస్త్రాలన్నింటినీ ప్రయోగించింది. 'చావో-రేవో' తేల్చుకోవాలనే కృత నిశ్చయంతో బరిలోకి దిగి విజయం ఢంకా మోగించింది.
ప్రస్తుతం దేశంలోనే ఏకైక మహిళా సీఎం మమత. దేశంలో ఘన చరిత్ర ఉన్న రాష్ట్రాన్ని పదేళ్లుగా పాలిస్తూ.. దేశ రాజకీయాల్లో కీలకంగా మారిన వ్యక్తి. ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె నైజం. దేశంలో 'మోదీ' సునామీకి అడ్డుకట్ట వేసేందుకు విపక్షాల వద్ద ఉన్న ప్రధాన అస్త్రం కూడా ఆమే. ఎవరినైనా ఢీ కొట్టగలిగే ధైర్యం దీదీ సొంతం. ప్రజా నేతగా, ప్రజల మనిషిగా మమతకు ఎంతో గుర్తింపు కూడా ఉంది. పట్టు వదలకుండా.. పార్టీని భుజాలపై మోస్తూ ఇన్నేళ్లుగా బంగాల్ను ఏకపక్షంగా ఏలారు. మరోసారి ప్రజల ఆదరణ చూరగొన్నారు.
మమతకు విజయానికి కారణాలు..
- రాష్ట్రంలో మమతా బెనర్జీ చరిష్మా, పటిష్ఠ నాయకత్వం, బలమైన క్యాడర్
- ఔట్ సైడర్స్ నినాదాన్ని మమత ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం
- కీలక నేత సువేందు అధికారి పార్టీని వీడినా.. క్యాడర్లో ఆ లోపం కనపడనీకుండా చేయడం
- భాజపా రాష్ట్ర నాయకత్వంలో మమతకు దీటైన నాయకుడు లేకపోవడం
- మోదీ వర్సెస్ దీదీ అంటూ భాజపా కేంద్ర నాయకత్వం సాగించిన ప్రచారాన్ని ప్రజలు నమ్మకపోవడం
- సాధారణ ఎన్నికల ఫలితాల గుణపాఠంతో మమత పక్కా వ్యూహంతో ముందుకెళ్లడం
కలిసొచ్చిన అంశాలు..
ముస్లిం నేత సిద్ధిఖీ- ఓవైసీ కలిసి పోటీ చేయకపోవడం మమతకు కలిసొచ్చింది. ఓవైసీ-సిద్ధిఖీ కలిసి పోటీ చేసినట్లయితే ముస్లిం ఓట్లు గంపగుత్తగా వీరి కూటమికి పడేవి. ఫలితంగా మమతకు బలమైన ఓటు బ్యాంకు అయిన మైనార్టీల మద్దతును కోల్పోయేది. అయితే అది జరగలేదు.
- కలిసొచ్చిన సీఏఏ వ్యతిరేక నినాదం
- చన్నీళ్లకు వేడి నీళ్లు అన్నట్లు ప్రచార సమయంలో మమత గాయపడటం వల్ల.. అది మమతకు సానుకూలంగా మారినట్లు విశ్లేషకుల అభిప్రాయం
- చివరి నివిషంలో కరోనా టీకా ఫ్రీ అని ప్రకటించడం
- టీఎంసీ తరఫున సినీ తారల ప్రచారం
- కాంగ్రెస్-వామపక్షాలు- ప్రముఖ ముస్లిం నేత సిద్ధిఖీతో కూడిన కూటమి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం.