Rajyotsava Award Winner Huchamma : జీవనోపాధికి ఆసరాగా ఉన్న రెండెకరాల భూమిని ప్రభుత్వ పాఠశాలకు విరాళంగా ఇచ్చి, అదే బడిలో వంట మనిషిగా పనిచేస్తున్న ఓ వృద్ధురాలిని కర్ణాటక రెండో అత్యున్నత పౌర పురస్కారం వరించింది. అవార్డు కోసం దరఖాస్తు చేసుకోనప్పటికీ.. ఆమె చేసిన సేవను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ అవార్డును ప్రకటించింది.
కొప్పళ జిల్లాలోని కునికేరికి ప్రాంతానికి చెందిన హుచ్చమ్మ చౌదరి(68)కి సంతానం లేదు. భర్త కాలం చేశారు. తనకు ఉన్న రెండు ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల నిర్మాణం కోసం తన రెండెకరాల భూమిని విరాళంగా ఇచ్చేశారు. ఆ భూమి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుంది. ఒక ఎకరంలో బడిని, మిగిలిన ప్రాంతంలో ప్లేగ్రౌండ్ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదే పాఠశాలలో వంట మనిషిగా పని చేస్తూ జీవిస్తున్నారామె. బడి పిల్లలే తన బిడ్డలుగా భావించి ఆనందంగా గడిపేస్తున్నారు. ఆమె చేసిన పనికి జిల్లాలోని అనేక సేవా సంస్థలు హుచ్చమ్మ ఉంటున్న గ్రామానికి వచ్చి మరీ అవార్డులతో సత్కరించాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆమె సేవను గుర్తించి రాజ్యోత్సవ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డు కోసం హుచ్చమ్మ దరఖాస్తు చేసుకోనప్పటికీ అవార్డుకు ఎంపిక చేయటం విశేషం.
కర్ణాటక రాజ్యోత్సవ అవార్డులను ఏటా నవంబర్ 1న ప్రకటిస్తారు. సంగీతం, నృత్యం, సినిమా, సామాజిక సేవ, మీడియా, వైద్యం, క్రీడలు, విద్యతో పాటు వివిధ రంగాల్లో చేసిన సేవలు చేసినవారికి గుర్తింపుగా ఈ అవార్డులను ఇస్తారు. ఈ సంవత్సరం కర్ణాటక ప్రభుత్వం 68వ కన్నడ రాజ్యోత్సవం వేడుకల సందర్భంగా వివిధ రంగాలకు చెందిన 68 మందిని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ జాబితాలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ కూడా ఉన్నారు. హుచ్చమ్మతో పాటు అదే జిల్లాకు చెందిన మరో ఇద్దరు అవార్డుకు ఎంపికయ్యారు. పురస్కార గ్రహీతలకు బహుమతిగా 20 గ్రాముల బంగారు పతకం, లక్ష రూపాయల నగదును అందించనున్నట్లు కర్ణాటక సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ తంగడిగ తెలిపారు.
సూపర్ 'బామ్మ'.. 74 ఏళ్లపాటు 'లీవ్' పెట్టకుండానే జాబ్.. 90 ఏళ్లకు రిటైర్మెంట్!
60 ఏళ్ల బామ్మ.. 13 ఏళ్ల మనవరాలు.. కరాటే పోటీల్లో విజేతలు.. 3 పతకాలతో ఇంటికి!