అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో భారత్- చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో ప్రకటన చేశారు. దేశ భూభాగాన్ని ఆక్రమించకుండా చైనా సైన్యాన్ని భారత దళాలు సమర్థంగా అడ్డుకున్నాయని చెప్పారు. చైనా దళాలు తమ స్థావరాలకు తిరిగి వెళ్లేలా ధైర్యంగా వ్యవహరించాయని స్పష్టం చేశారు.
"చైనా సైన్యం డిసెంబర్ 9న తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సే సమీపంలో ఆక్రమణకు ప్రయత్నించాయి. యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాన్ని మన దళాలు సరైన పద్ధతిలో ఎదుర్కొన్నాయి. ధైర్యంగా చైనా పీఎల్ఏ సైన్యాన్ని అడ్డుకున్నాయి. మన భూభాగాన్ని ఆక్రమించకుండా చేసి తమ స్థావరాలకు చైనా సైన్యం వెళ్లిపోయేలా చేశాయి. ఈ ఘటనలో మన సైనికులెవరూ చనిపోలేదు. ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు."
-రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి
"మన ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు బలగాలు పూర్తిగా కట్టుబడి ఉన్నాయని, దానికి వ్యతిరేకంగా జరిగే ఎలాంటి ప్రయత్నాలనైనా నిరోధించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని నేను ఈ సభకు హామీ ఇస్తున్నా" అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని.. సరిహద్దులో శాంతి, ప్రశాంతతను కాపాడాలని చైనాకు పిలుపునిచ్చారు. ఈ సమస్యను దౌత్య మార్గాల ద్వారా చైనా వైపు కూడా తీసుకువెళ్లినట్లు సింగ్ చెప్పారు. సైనికుల ధైర్యానికి మద్దతుగా ఈ సభ మొత్తం ఐక్యంగా నిలుస్తుందన్న నమ్మకం తనకు ఉందని రాజ్‌నాథ్ అన్నారు.
మరోవైపు సరిహద్దుల్లో ఘర్షణపై ప్రధాని నరేంద్ర మోదీ.. పలువురు సీనియర్ మంత్రులతో చర్చించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా త్రివిధ దళాల ప్రధానాధికారులతో తాజా పరిస్థితులపై చర్చలు జరిపారు.
చర్చలకు ముందు ఇలా..
అంతకుముందు భారత్-చైనా సైనికుల ఘర్షణపై చర్చించాలంటూ ఉభయసభల్లో విపక్షాలు ఆందోళనకు దిగాయి. తవాంగ్ ఘటనపై తమను మాట్లాడనివ్వడం లేదని ఆరోపిస్తూ లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు గందరగోళం సృష్టించారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ క్రమంలో ఉభయసభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. ఆందోళనకు దిగిన విపక్ష సభ్యుల్లో కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, ఏఐఏడీఎంకే ఎంపీలు ఉన్నారు.
'భాజపా ఉన్నంతవరకు అది జరగదు'
లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్న నిరసనలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు విదేశాల నుంచి వచ్చే విరాళాలకు సంబంధించిన ప్రశ్న ఉండటంతో కాంగ్రెస్ సభ్యులు సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. ఇదే సమయంలో అరుణాచల్ సరిహద్దుల్లో డ్రాగన్ దురాక్రమణ యత్నాలపై స్పందించిన అమిత్ షా.. భారత బలగాలు అద్భుతంగా పోరాడారని కొనియాడారు. చైనా బలగాలను వెనక్కి పంపి భారత భూభాగాన్ని కాపాడారని తెలిపారు.
'ప్రధాని మోదీ నేతృత్వంలోని భారతీయ జనతాపార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఎప్పటి వరకు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందో అప్పటిదాకా ఒక్క ఇంచు భూమిని కూడా ఎవరూ ఆక్రమించుకోలేరు. అరుణాచల్ ప్రదేశ్‌లో భారత బలగాలు చూపిన పరాక్రమం ప్రశంసనీయం. ఘటన జరిగిన గంటల్లోనే ప్రత్యర్థులను వెనక్కి పంపి, మన భూభాగాన్ని రక్షించారు' అని షా పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వద్ద భారత్ -చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయలయ్యాయి. దీంతో ఈ విషయాన్ని చర్చించేందుకు కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదా నోటీసులు ఇచ్చారు. దిగువ సభలో మనీష్ తివారీ నోటీసు ఇవ్వగా, కాంగ్రెస్ నేతలు రణదీప్ సూర్జేవాలా, సయ్యద్ నాసిర్ హుస్సేన్ ఎగువ సభలో కూడా ఇదే విధమైన వాయిదా నోటీసులు ఇచ్చారు.