ఉత్తరాఖండ్‌లో జల విలయం కొనసాగుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో(Uttarakhand Rain News) ఆ రాష్ట్రంలోని నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటివరకు 44 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తరాఖండ్ వాసులకు ఉపశమనం కలిగించే వార్త.. వాతావరణ శాఖ(Uttarakhand Weather) చెప్పింది. మంగళవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పడుతాయని పేర్కొంది.
ఏయే జిల్లాలో ఎంత మంది చనిపోయారు?
జిల్లా | మృతులు |
నైనితాల్ | 30 |
చంపావత్ | 04 |
పౌడీ | 03 |
అల్మోడా | 05 |
పిథోర్‌గఢ్ | 01 |
బాగేశ్వర్ | 01 |
మొత్తం | 44 |
మోదీ, అమిత్ షా ఆరా..
ఉత్తరాఖండ్ వర్షాల నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఫోన్ చేశారు. ఉత్తరాఖండ్‌లో ప్రస్తుత పరిస్థితులపై(Uttarakhand Rain News) ఆరా తీశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సీఎంతో ఫోన్లో మాట్లాడారు.
ఉపరాష్ట్రపతి దిగ్భ్రాంతి..
ఉత్తరాఖండ్‌లో వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోవడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రజలంతా స్థానిక అధికారులు జారీ చేసిన సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
పరిహారం..
కుమావోన్, గర్వాల్ ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రజలను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ మంగళవారం కలిశారు. వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు.
ఆగని మరణాలు..
నైనితాల్ జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. జిల్లాలోని రామ్‌నగర్‌లో ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రామ్‌నగర్‌లో ఆర్మీ, వాయుసేన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. జిల్లాలోని ఖురాబ్లో వర్షాల ధాటికి ఇద్దరు మృతి చెందారు. ముక్తేశ్వర్ గ్రామంలో ముగ్గురు, ఝూటియా గ్రామంలో ఐదుగురు చనిపోయారు. అల్మోడా జిల్లాలో మరో ముగ్గురు మరణించారు.
పౌడీ జిల్లాలో సోమవారం ముగ్గురు కూలీలు వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. చంపావత్ జిల్లాలో ఓ తల్లీ, కుమారుడు చనిపోయారు. బాగేశ్వర్ జిల్లా భానర్లో ఓ బండరాయి మీద పడగా.. వ్యక్తి మరణించాడు.
కొనసాగుతున్న సహాయక చర్యలు..
వరద ప్రభావిత జిల్లాల్లో అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. చంపావత్, నైనితాల్ జిల్లాల్లో వరదల్లో చిక్కుకున్న 116 మందిని సైన్యం కాపాడింది. రాష్ట్రంలోని పలు జిల్లాలో గత 48 గంటలుగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: నదుల ఉగ్రరూపం- రిసార్టుల్లోని టూరిస్టుల పరిస్థితి భయానకం
ఇదీ చూడండి: దేవభూమిపై వరుణుడి పంజా- 16 మంది బలి