Bharat JODO Yatra: భాజపా చేస్తున్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా భారత ప్రజలను ఏకం చేసేందుకు సుదీర్ఘ పోరాటం చేస్తామంటోన్న కాంగ్రెస్ పార్టీ.. భారత్ జోడో యాత్ర పేరుతో దేశవ్యాప్త పర్యటనకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో సెప్టెంబర్ 7న మొదలు కానున్న ఈ యాత్రకు సంబంధించిన లోగో, ట్యాగ్‌లైన్, పోస్టర్‌ను పార్టీ సీనియర్ నేతలు జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ దిల్లీలో మంగళవారం విడుదల చేశారు. 'మిలే కదం.. జుడే వతన్ (అడుగులో అడుగు వేద్దాం.. దేశాన్ని ఏకం చేద్దాం)' అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 12కుపైగా రాష్ట్రాల్లో 3500కి.మీ మేర సాగే ఈ యాత్ర మొత్తం నడకలోనే సాగుతుందని చెప్పారు. యాత్ర కోసం ప్రత్యేక వెబ్‌సైట్ కూడా ప్రారంభించామని సీనియర్ నేతలు వెల్లడించారు.
పాదయాత్ర సంగతులు..
- సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో మొదలయ్యే 'భారత్ జోడో యాత్ర' 148 రోజుల పాటు కొనసాగి కశ్మీర్‌లో ముగుస్తుంది
- దాదాపు ఐదు నెలలపాటు కొనసాగే ఈ యాత్ర 12 రాష్ట్రాల మీదుగా 3500 కి.మీ సాగనుంది
- ప్రతి రోజు 25కి.మీ పాటు యాత్ర కొనసాగుతుంది
- జోడో యాత్రలో భాగంగా ర్యాలీలు, బహిరంగ సభలు ఉంటాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు ప్రియాంకగాంధీ వాద్రాలు పలు సభల్లో పాల్గొంటారు.
- యాత్రలో రాహుల్ గాంధీ ఏ హోటల్‌లోనూ బస చేయరని.. యాత్ర మార్గంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసే వసతుల్లో ఆయన బస చేస్తారని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.
- రాహుల్‌తోపాటు మరో 50 మంది కాంగ్రెస్ నేతలు తొలుత పాదయాత్రలో పాల్గొననున్నారు. మార్గమధ్యలో ఆయా రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలు చేరుతారు.
- ఈ యాత్రను కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నప్పటికీ పార్టీ లోగోను మాత్రం ఎక్కడా పొందుపరచలేదు.
- ఏదో ఒక పార్టీకి పరిమితం చెందిన యాత్రగా కాకుండా అన్ని వర్గాలను ఏకం చేసేందుకు ఈ యాత్రను చేపడుతున్నామని.. అందుకే కాంగ్రెస్ గుర్తు పెట్టలేదని జైరాం రమేష్ వెల్లడించారు.
- యాత్ర లోగో, ట్యాగ్‌లైన్ విడుదలపై స్పందించిన రాహుల్ గాంధీ.. 'ఒక అడుగు నీది, ఒక అడుగు నాది.. యాత్రలో చేరి మనమందరం భారత్‌ను ఏకం చేద్దాం' అంటూ పిలుపునిచ్చారు.
అంతకుముందు భారత్ జోడో యాత్రపై ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడిన రాహుల్ గాంధీ.. ఈ యాత్ర తనకో తపస్సు లాంటిదని పేర్కొన్నారు. దేశాన్ని ఏకం చేయడం అనేది ఒక సుదీర్ఘ పోరాటమని తెలిసినప్పటికీ అందుకు తాను సిద్ధంగానే ఉన్నానని ఉద్ఘాటించారు.
వైద్యపరీక్షల కోసం విదేశాలకు సోనియా..
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వైద్యపరీక్షల కోసం విదేశాలకు వెళ్లనున్నారు. కుమారుడు రాహుల్‌గాంధీ, కుమార్తె ప్రియాంకాగాంధీ ఆమెకు తోడుగా వెళతారని కాంగ్రెస్ పార్టీ మంగళవారం వెల్లడించింది. సోనియా ఏ దేశం వెళుతున్నారు, ఎప్పుడు అనే వివరాలను పార్టీ వెల్లడించలేదు. 'దిల్లీకి వచ్చేముందు.. అస్వస్థతతో ఉన్న తన తల్లిని సోనియా పరామర్శిస్తారు' అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. తల్లితోపాటు వెళుతున్న రాహుల్‌గాంధీ సెప్టెంబరు 4న దిల్లీలో నిర్వహించే 'మెహంగాయీ పర్ హల్లాబోల్' ర్యాలీలో ప్రసంగిస్తారని వెల్లడించారు.
ఇవీ చదవండి: జైలుకెళ్తే చదువు బాధ తప్పుతుందని స్నేహితుడి గొంతు కోసి