Rahul Gandhi Karnataka: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. కర్ణాటక చిత్రదుర్గలోని శ్రీ జగద్గురు మురుగరాజేంద్ర విద్యాపీఠ్ను సందర్శించారు. మఠాధిపతి డా. శ్రీ శివమూర్తి మురుగ రాజేంద్ర శరణరు నుంచి ఆయన 'ఇష్టలింగ దీక్ష'ను స్వీకరించారు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ ట్విట్టర్లో వెల్లడించారు. సాధారణంగా లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు.. ఈ ఆచారాన్ని పాటిస్తారు. స్వామి బసవన్న బోధనలు ఎప్పటికీ నిలిచి పోతాయని, వాటి గురించి తాను తెలుసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు రాహుల్. మఠాన్ని సందర్శించిన రాహుల్ వెంట కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా ఉన్నారు.
అయితే.. ఈ క్రమంలోనే రాహుల్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఓ స్వామీజీ. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారని జోస్యం చెప్పారు హవేరి హోసముట్ స్వామీజీ. అయితే ఇంతలోనే జోక్యం చేసుకున్న మఠాధిపతి శ్రీ శివమూర్తి మురుగ శరణరు.. అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని స్వామీజీని అడ్డుకున్నారు. ఇది రాజకీయ వేదిక కాదని.. ప్రజలే దానిని నిర్ణయిస్తారని చెప్పారు.
''ఇందిరా గాంధీ ప్రధానిగా పనిచేశారు. రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యారు. ఇప్పుడు రాహుల్ గాంధీ లింగాయత్ శాఖలోకి ప్రవేశించారు కాబట్టి.. ఈయన కూడా ప్రధాని అవుతారు.''
- హవేరి హోసముట్ స్వామీజీ
అంతా కలిసి భాజపాను ఓడిస్తాం.. హుబ్బళ్లిలో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశానికి హాజరయ్యేందుకు మంగళవారమే కర్ణాటక చేరుకున్నారు రాహుల్. ఆ రాత్రి జరిగిన భేటీలో.. 2023 అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధత గురించి రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపారు. బుధవారం.. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య 75వ జన్మదిన వేడుకలకు కూడా రాహుల్ హాజరయ్యారు.
2023 ఏప్రిల్- మే నెలలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నుంచి డీకే శివకుమార్, సిద్ధరామయ్య ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో.. బుధవారం ఆసక్తికర పరిణామం జరిగింది. రాహుల్ గాంధీ సమక్షంలోనే.. సిద్ధరామయ్యను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు డీకే. దీనిపై రాహుల్ సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సమష్టిగా పోరాడి.. కర్ణాటకలో భాజపా, ఆర్ఎస్ఎస్ను ఓడిస్తుందని అన్నారు.
ఇవీ చూడండి: ఐసీయూలో రోగికి 'భూతవైద్యుడి' ట్రీట్మెంట్.. డాక్టర్లంతా అక్కడే ఉన్నా..
ఇంట్లోనే 'హిమాలయన్ వయాగ్రా' సృష్టి.. కిలో రూ.25 లక్షలు.. రైతుకు జాక్పాట్!