QS Asia University Rankings 2024 India : ఆసియా దేశాల్లోని విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ర్యాంకింగ్స్‌లో భారత్ అదరగొట్టింది. ప్రతిష్ఠాత్మక క్యూఎస్(క్వాకరెల్లి సైమండ్స్) సంస్థ 2024 ఏడాదికి గాను బుధవారం విడుదల చేసిన ర్యాంకుల్లో భారత్‌లోని టాప్ యూనివర్సిటీలు సత్తా చాటాయి. ఐఐటీ బాంబే, ఐఐటీ దిల్లీ అగ్రశ్రేణి-50 విశ్వవిద్యాలయాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఐఐటీ బాంబే 40వ ర్యాంకు, ఐఐటీ-దిల్లీ 46వ ర్యాంకులతో మెరిశాయి. మొత్తం 856 విశ్వవిద్యాలయాలతో కూడిన ఈ జాబితాలో.. భారత్ నుంచే అత్యధికంగా 148 విద్యా సంస్థలు ఉండటం విశేషం. దీంతో చైనా (133), జపాన్(96)లను భారత్ వెనక్కి నెట్టినట్లయ్యింది. ఇక ఈ ర్యాంకింగ్స్ జాబితాలో మయన్మార్, కంబోడియా, నేపాల్ తొలిసారిగా చోటు దక్కించుకున్నాయి.
కొత్తగా చేరిన 37 విద్యాసంస్థలు..
క్యూఎస్ ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో గతేడాది మాదిరిగానే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్- ఐఐఎస్‌సీ(బెంగళూరు), దిల్లీ విశ్వవిద్యాలయం, ఐఐటీ-బాంబే, దిల్లీ, మద్రాస్, ఖరగ్‌పుర్, కాన్పూర్ అగ్రశ్రేణి 100 విద్యా సంస్థల జాబితాలో నిలిచాయి. గతేడాది భారత్ నుంచి 111 వర్సిటీలు క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించుకోగా.. ఈసారి ఆ సంఖ్య 148కి చేరింది. కొత్తగా 37 విద్యా సంస్థలు చేరాయి. అదే సమయంలో చైనా నుంచి 133 వర్సిటీలు; జపాన్ నుంచి 96 విశ్వవిద్యాలయాలు మాత్రమే ఈ ర్యాంకింగ్స్ జాబితాలో ఉన్నాయి.
అయితే ఆయా విశ్వవిద్యాలయాల్లో అకడమిక్ కార్యకలాపాలు, పరిశోధన పత్రాల సమర్పణ, విద్యార్థి-ఆచార్యుల నిష్పత్తి, ఆచార్యుల సంఖ్య, వసతులు, విదేశీ విద్యార్థులు తదితర అంశాలను సమగ్రంగా విశ్లేషించి ఈ క్యూఎస్ ర్యాంకింగ్స్ జాబితాను రూపొందిస్తారు. ఇక ఈ లిస్ట్‌లో పెకింగ్ యూనివర్సిటీ ఆఫ్ చైనా మొదటి ర్యాంకుతో సత్తా చాటింది. యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ రెండో స్థానంలో, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ మూడో స్థానంలో నిలిచాయి. నాన్యాంగ్ టెక్నోలాజికల్ యూనివర్సిటీ(సింగపూర్), సింగువా యూనివర్సిటీ(చైనా) నాలుగైదు స్థానాల్లో ఉన్నాయి.
'భారత్‌లో విద్యారంగ విస్తరణ ప్రతిబింబిస్తోంది'
క్యూఎస్ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్‌లో భారతీయ యూనివర్సిటీల సంఖ్య పెరగడం.. ఆ దేశంలో ఉన్నత విద్యారంగం విస్తరణను ప్రతిబింబిస్తోందని క్యూఎస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ బెన్ సౌటెర్ అన్నారు. భారత విద్యా సంస్థల గణనీయ పెరుగుదల, వాటి పరిశోధనా సహకారాలు ఆ దేశ విద్యా ముఖచిత్రంలో గొప్ప పురోగతిని సూచిస్తోందని చెప్పారు. ప్రపంచ స్థాయిలో భారత్ తన స్థానాన్ని మరింతగా మెరుగుపరుచుకొనేందుకు ఇది ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలిపారు.