ముగిసిన భేటీ
పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీతో పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భేటీ ముగిసింది. పార్టీలో ఏర్పడిన సంక్షోభంపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. పీసీసీ పదవికి రాజీనామా చేసిన సిద్ధూ.. తన అభ్యంతరాలను చన్నీకి వివరించినట్లు తెలుస్తోంది. రెండు గంటలకు పైగా సమావేశం జరిగినప్పటికీ.. ఎలాంటి పరిష్కారం లభించలేదు.
ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం.. పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు హరీశ్ రావత్‌ను రంగంలోకి దించుతోంది. సమస్య పరిష్కారం కోసం ఆయనే స్వయంగా చండీగఢ్ రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రకటన విడుదల చేసిన రావత్.. సంక్షోభం సద్దుమణిగేందుకు వారం సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేబినెట్ ఏర్పాటుతో సమస్య ముగిసిపోతుందని భావించానని చెప్పారు.
సిద్ధూకు ఆఫర్
సమావేశం అనంతరం చరణ్‌జీత్ సింగ్ చన్నీ.. మీడియాతో మాట్లాడలేదు. అయితే, సిద్ధూకు చన్నీ ఓ ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. దాన్ని స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా అన్నది సిద్ధూ ఇష్టమని చెప్పినట్లు సమాచారం. కానీ ఆ ఆఫర్ ఏంటన్నది తెలియలేదు.
అయితే, ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ఓ ఫార్ములాను రూపొందించినట్లు వెల్లడించాయి.
మంత్రివర్గ సమావేశం..
ముఖ్యమంత్రి చన్నీ అక్టోబర్ 4న అత్యవసర మంత్రివర్గ సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ రోజునే అన్ని విషయాలకు సమాధానం దొరికే అవకాశం ఉందని తెలుస్తోంది. సిద్ధూ ఆకాంక్షలకు అనుగుణంగా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
సెప్టెంబర్ 28న పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు సిద్ధూ. అయితే దీన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ఇంతవరకు ఆమోదించలేదు. రాష్ట్ర స్థాయిలోనే విభేదాలను పరిష్కరించుకోవాలని చన్నీ, సిద్ధూలకు సూచించింది.