Polygraph Test For Parliament Incident Accused : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లోక్‌సభ ఘటనకు సంబంధించి అరెస్టయిన ఆరుగురిలో ఐదుగురు నిందితులు పాలిగ్రాఫ్ పరీక్ష చేయించుకునేందుకు అంగీకరించారు. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి హర్దీప్ కౌర్ ముందు శుక్రవారం తమ సమ్మతిని తెలియజేశారు. అంతకుముందు నిందితులందరికీ పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దిల్లీ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ జరిపిన కోర్టు టెస్టుకు అంగీకరించిన నిందితులకు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతినిచ్చింది.
మరోవైపు శుక్రవారంతో నిందితుల పోలీస్ కస్టడీ గడువు ముగియనున్న నేపథ్యంలో నిందితులు- డీ మనోరంజన్, సాగర్ శర్మ, అమెల్ ధన్‌రాజ్ షిందే, నీలం ఆజాద్, లలిత్ ఝా, మహేశ్ కుమావత్‌లను కోర్టు ముందు హాజరుపరిచారు దిల్లీ పోలీసులు. వీరి అభ్యర్థన మేరకు కస్టడీని మరో 8 రోజుల పాటు పొడిగించారు న్యాయమూర్తి. కాగా, నిందితుల్లో నీలం ఆజాద్ మినహా మిగతా వారంతా పాలిగ్రాఫ్ టెస్ట్‌కు అంగీకరించారని పోలీసులు తెలిపారు.
పాలిగ్రాఫ్ అంటే ఏమిటి?
Polygraph Test Means : పాలిగ్రాఫ్ పరీక్షనే లై డిటెక్టర్ టెస్టు అని కూడా పిలుస్తారు. దర్యాప్తు జరిపే అధికారులు నిందితుల నుంచి నిజాలు రాబట్టేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. ప్రశ్నిస్తున్నప్పుడు వారు నిజాలు చెబుతున్నారా లేదా అబద్ధం చెబుతున్నారా అనే విషయాలను దీనిద్వారా సులువుగా గుర్తించవచ్చు. ఇందులో ఎటువంటి ఔషధాలు, మత్తుమందులు వాడరు. కేవలం నిందితుడి శరీరానికి కార్డియో-కఫ్‌లు లేదా తేలికపాటి ఎలక్ట్రోడ్‌లతోపాటు ఇతర పరికరాలను మాత్రమే ఫిక్స్ చేస్తారు. వీటితో ఆ వ్యక్తికి సంబంధించిన బీపీ, శ్వాసక్రియ రేటును పర్యవేక్షిస్తారు. నిందితుడు సమాధానాలు చెప్పే సమయంలో వారి శరీరం ఎలా స్పందిస్తుందో, దాని ఆధారంగా నిందితులు నిజం లేదా అబద్ధం చెబుతున్నారా అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ నిందితుడు అబద్ధం చెబితే అతడి శరీరంలో మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా బీపీ, శ్వాసక్రియ రేటు మారుతుంది. తద్వారా నిందితుడు చెప్పేది వాస్తవమా? అవాస్తవమా? అని వాటికిచ్చిన నంబర్ ఆధారంగా దర్యాప్తు అధికారులు గుర్తిస్తారు.
ఇదీ జరిగింది
Parliament Security Breach Issue : గత డిసెంబర్లో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో లోక్‌సభలోని విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్న సాగర్ శర్మ, మనోరంజన్ జీరో అవర్ సమయంలో ఛాంబర్‌లోకి దూకి అలజడి సృష్టించారు. పసుపు రంగులో ఉండే గ్యాస్ క్యాన్లను స్ప్రే చేస్తూ నినాదాలు చేశారు. అదే సమయంలో అమోల్ శిందే, నీలం పార్లమెంట్ వెలుపల పలు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.
ఈడీ బృందంపై దాడి- కారు అద్దాలు ధ్వంసం- సోదాల సమయంలో ఘటన
ఇనుము లేకుండానే రామమందిర నిర్మాణం- 21 అడుగుల గ్రానైట్ పునాది- 'అయోధ్య అద్భుతాలు' ఇవే