Political Parties Special Focus On Greater Hyderabad : ఏ ఎన్నిక వచ్చినా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓటింగ్ శాతం తక్కువ నమోదవడం రివాజుగా మారింది. భాగ్యనగరం కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఓటర్లు చైతన్యం చూపిస్తున్నారు. మహానగరంలో అధికంగా విద్యా వంతులు, ఉద్యోగులు ఉన్నా.. పోలింగ్ శాతం మాత్రం పడిపోతూ వస్తోంది. 2020 గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికల్లో 46 శాతం, 2019 లోక్‌సభ ఎన్నికల్లో 45, 2018 అసెంబ్లీ పోరులో 50 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 60 నుంచి 70 శాతం వరకు నమోదవుతుంటే.. హైదరాబాద్‌లో మాత్రం గణనీయంగా పతనమవుతూ వస్తోంది. ఈ ఎన్నికల్లో ఆ సంప్రదాయానికి చరమగీతం పాడించాలనే ఉద్దేశంతో బల్దియా పక్కా ప్రణాళికలతో పనిచేస్తోంది. విస్తృత ఓటరు అవగాహన కార్యక్రమాలు రూపొందించి.. ఓటుహక్కు ఆవశ్యకతను క్షేత్రస్థాయిలో వివరిస్తున్నారు.
Hyderabad Election Officers on Voting Percentage : ఓటింగ్ శాతం పెంపు కోసం హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు పలు మార్గాలను అన్వేషించారు. దాదాపు మూడు లక్షల డూప్లికేట్ ఓట్ల తొలగింపుతో పాటు.. ఒకే ఇంట్లో ఉన్నవాళ్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేలా మూడున్నర లక్షల ఓట్లను సర్దుబాటు చేశారు. చాలా ఏళ్లుగా తప్పులతడకగా ఉన్న ఓటర్ల జాబితా.. ఒకే వ్యక్తి కొత్త ఓటు కోసం ఎక్కువ దరఖాస్తులు పెట్టడం, హైదరాబాద్‌కు వలస వచ్చినవారు.. నగరంతో పాటు స్వస్థలాల్లో ఓటింగ్ ఉండటం పోలింగ్ శాతం తగ్గడానికి కారణాలుగా అధికారులు విశ్లేషిస్తున్నారు.
ఒకే వ్యక్తి రెండు, మూడు అప్లికేషన్లు పెట్టడం. ఆ రెండు, మూడు అప్లికేషన్లు కూడా యాక్సెప్ట్ చేయడం. చాలామంది ఇల్లు మారుతూ ఉంటారు. ఇల్లు మారేతప్పుడు పాత ఓటును తొలగించడం లేదు. దీనికి ఫామ్ 8 ద్వారా అప్లై చేసుకోవాలి. మళ్లీ దానినికాకుండా ఫామ్ 6 ద్వారా కొత్తది అప్లై చేసుకుంటున్నారు. దీంతో ఆ పాత చోట్ల ఓట్లు అలాగే ఉండిపోతున్నాయి. -రోనాల్డ్ రోస్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి
గ్రేటర్ హైదరాబాద్‌లో ఓటరునాడి ఎలా ఉంది?
Telangana Assembly Elections 2023 : హైదరాబాద్‌లో ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు చాలా మంది ఇళ్లు మారుతుంటారు. అప్పటి వరకు ఉన్న పాత ఓట్లను తొలగించకపోవడాన్ని అధికారులు గుర్తించారు. దీన్ని కట్టడి చేసేందుకు గత జూన్, జులైలో ఇంటింటికి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రెండుచోట్ల ఉన్నవి తొలగించి ప్రస్తుతం ఉన్న చిరునామాలో ఓటు మాత్రమే ఉంచారు. బూత్ స్థాయి అధికారులు ఓటింగ్ స్లిప్ అందించి ఓటరు సంతకం తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఓటరు సమాచార స్లిప్స్ వల్ల ఓటింగ్ శాతం పెరిగేందుకు ఎంతో దోహదం చేయనుందని అంచనా వేస్తున్నారు.
అసెంబ్లీ సమరానికి సై అంటున్న భాగ్యనగరం - పోలింగ్ ఏర్పాట్లలో బిజీగా అధికార యంత్రాంగం