Police Station Set On Fire In Odisha : ఒడిశా.. కంధమాల్ జిల్లాలో దారుణం జరిగింది. పోలీసులు గంజాయి విక్రయిస్తున్నారన్న ఆరోపణలతో ఫిరంగియా పోలీస్ స్టేషన్‌కు నిప్పుపెట్టారు దుండగులు. అనంతరం పోలీసులపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిరంగియా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఐఐసీ (ఇన్‌స్పెక్టర్ ర్యాంక్ అధికారి) తపన్ కుమార్, హోం గార్డు ప్రశాంత్ పన్, రవి దయాల్‌తో సహా తదితర పోలీసులు అధికారులపై.. సీజ్ చేసిన గంజాయి అమ్ముతున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు పోలీస్ జీపులో గంజాయి అమ్ముతున్న వీడియో.. ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం శనివారం వందల సంఖ్యలో స్థానికులు ఫిరంగియాలోని బైఠాయించి.. వెదురు బొంగులతో రోడ్డును మూసేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన నిరసనకారులు పోలీస్ స్టేషన్‌కు నిప్పంటించారు. అనంతరం పలువురు ఉన్నతాధికారులతో సహా పోలీసులపై దాడికి తెగబడ్డారు.
"నిరసనకారులు పోలీసు స్టేషన్‌లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, అనేక పత్రాలను దగ్ధం చేశారు. గంజాయి స్మగ్లింగ్‌లో ప్రమేయం ఉన్న పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్, ఇన్‌చార్జ్, మరికొందరు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. స్థానికులు ఫుల్బాని-ఫిరింగియా-బలిగూడ రహదారిని గంటల తరబడి దిగ్బంధించారు. పోలీసులపై వచ్చిన ఆరోపణలపై సరైన విచారణ జరుపుతాం. అయితే, ఫిరింగియా పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన హింసలో కొందరు గంజాయి వ్యాపారులు పాల్గొన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శాంతిభద్రతల పరిస్థితిని నియంత్రించడానికి పెద్ద సంఖ్యలో పోలీసుల బలగాలను అక్కడికి పంపించాం. కంధమాల్ ఎస్పీ బలగాలతో పాటు ఫిరింగియాకు వెళుతున్నారు. ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉంది"
--సత్యబ్రత భోయ్, దక్షిణ రేంజ్ ఐజీ
అయితే, గంజాయి స్మగ్లింగ్‌పై పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని.. వారు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆందోళనకారులు తెలిపారు.
గిరిజన బాలికపై రేప్.. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్‌కు నిప్పు..